AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi US Tour: రాహుల్ గాంధీ నోట పాత పాట.. మోదీపై తిట్ల దండకం.. మారని వ్యవహారం..!

ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా భారతీయులు ప్రవాసంలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంలో మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ఒక అడుగు ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లినపుడల్లా..

Rahul Gandhi US Tour: రాహుల్ గాంధీ నోట పాత పాట.. మోదీపై తిట్ల దండకం.. మారని వ్యవహారం..!
Rahul Gandhi US Visit
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jun 01, 2023 | 4:35 PM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన విదేశీ పర్యటన కేవలం భారతీయుల్లోనే కాదు, దేశం విడిచి వెళ్లిన ప్రవాస భారతీయుల్లోనూ తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఈసారైనా రాహుల్ గాంధీ కొత్తగా ఏమైనా మాట్లాడతారా అని ఎదురుచూసినవారికి నిరాశే ఎదురైంది. రాహుల్ మళ్లీ తన పాత పాటనే అందుకున్నారు. ఎప్పటిలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విదేశీ గడ్డపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా భారతీయులు ప్రవాసంలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ విషయంలో మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ఒక అడుగు ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లినపుడల్లా అక్కడున్న భారత సంతతి ప్రజలు ప్రదర్శించే ప్రేమాభిమానాలు, ప్రశంసలే ఇందుకు నిదర్శనం. ప్రవాస భారతీయుల్లో ప్రధాని మోదీ పట్ల ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని భారతీయులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రతినిధిగా, ప్రధాని పదవికి పోటీదారుడిగా ఉన్న రాహుల్ గాంధీ తన ఆదరణ పెంచుకోవడం కంటే మోదీ ప్రజాదరణను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఏ దేశానికి వెళ్లినా సరే.. రాహుల్ గాంధీ మాటల్లో, ప్రసంగాల్లో ఎక్కువగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని తూలనాడడమే కనిపిస్తుంది. తాజా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) పర్యటనలోనూ అదే పునరావృతమవుతోంది. అగ్రరాజ్యంలో ప్రధాన మంత్రి మోడీ అధికారిక పర్యటన జూన్ 21 నుంచి 24 వరకు సాగనుంది. ప్రధాని కంటే ముందే ఆ దేశం చేరుకున్న రాహుల్ గాంధీ.. యావత్ భారతీయ సమాజం దృష్టిని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అనేక విదేశీ పర్యటనలు చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పటి వరకు చేసిన ప్రకటనలు, ప్రసంగాలు చూస్తున్న వారికి వాటిలో కొత్తదనం లేదన్న సంగతి అర్థమవుతుంది.

సెల్ఫ్ గోల్ కామెంట్లు

ఇవి కూడా చదవండి

తన సమర్థత, సత్తా గురించి చాటుకోవాలంటే తన ప్రత్యర్థిని నిందించడం ఒక్కటే మార్గంగా పెట్టుకుంటే సరిపోదు. విమర్శలు అంశాలవారిగా నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ రాహుల్ విమర్శలు చాలా వరకు వ్యక్తిగతంగానే ఉంటున్నాయి. మొదట్లో ఆ విమర్శలు, తిట్ల దండకాలు ఆకట్టుకున్నప్పటికీ ఇప్పుడు అందరికీ బోర్ కొట్టిస్తున్నాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగ రచయితను మార్చడమో లేక నోరు విప్పక ముందు కాస్త హోంవర్క్ చేయడమో చేసి ఉండాల్సిందని ఆ పార్టీలోని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తన పరిణితిని చాటుకోబోయే క్రమంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ “భారతదేశంలో ముస్లింల పరిస్థితి 1980లలో దళితుల పరిస్థితిలాగే ఉంది” అన్నారు. 1980వ దశకంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న తన నానమ్మ ఇందిర, తర్వాత తండ్రి రాజీవ్ గాంధీయే అన్న విషయాన్ని రాహుల్ గాంధీ ఆ క్షణంలో విస్మరించారు. రాహుల్ గాంధీలో పరిణితి ఎప్పుడొస్తుందన్న ప్రశ్నతో పాటు మాట్లాడే ముందు ఎందుకు ఆలోచించరు అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. ఒక్కోసారి ఏం మాట్లాడతారో కూడా తెలీకుండా మాట్లాడతారని, ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడ్డం కారణంగానే చివరకు తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కోసారి ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు, ఒక్కోసారి మొదలుపెట్టిన ప్రసంగాన్ని ఎక్కడ ఆపాలో తెలియదు అన్నట్టుగా రాహుల్ ప్రసంగాలు సాగుతుంటాయి.

రాహుల్ ప్రసంగాల్లో విమర్శ కంటే మోదీపై విద్వేషం ఎక్కువగా కనిపిస్తుందని, చివరకు దేశ ప్రతిష్టను దిగజార్జేలా మాట్లాడుతుంటారని బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే ఏం మాట్లాడతారోనని ఎదురుచూసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడబోయేది ఏంటో అందరికీ తెలుసని, అందుకే తాము ఇప్పుడు రాహుల్ విదేశీ ప్రసంగాలను కనీసం ట్రాకింగ్ కూడా చేయడం లేదని చెబుతున్నారు. కాకపోతే ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగి అనేక రంగాల్లో అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్న భారతదేశ ప్రతిష్టను రాహుల్ గాంధీ దిగజార్చడం మానుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. నిర్మాణాత్మక విమర్శలు ప్రపంచంలో ఎవరైనా సరే స్వాగతిస్తారని, కానీ వ్యక్తిత్వహననానికి పాల్పడే మాట్లాడితే దీర్ఘకాలంలో ఎవరూ హర్షించరని సూచిస్తున్నారు.

“మీరు మోదీని భగవంతుడి పక్కన కూర్చోబెడితే, విశ్వం ఎలా పనిచేస్తుందో మోదీ దేవుడికి వివరించడం మొదలుపెడతారు” అంటూ రాహుల్ గాంధీ చేసిన అసందర్భ కామెంట్ ఆయన అపరిపక్వతకు సంకేతంగా నిలుస్తుంది తప్ప మరేమీ కాదు. విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ మాదిరిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నలను స్వీకరించకపోవచ్చు. కానీ అక్కడి ప్రజలు ఆయన నోటి నుంచి ఏం వినాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు. తన ప్రసంగాల ద్వారా అదే అందజేస్తారు. అయితే రాహుల్ ప్రసంగాల్లో, మాటల్లో ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో ఇంకా నేర్చుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రవాస భారతీయ సమాజం అంటేనే తెలివితేటలు, మేధస్సు, వివిధ రంగాల్లో నైపుణ్యం కల్గిన సమూహంగా పేరు తెచ్చుకుంది. అలాంటి సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ సానుభూతిపరులను ఉద్దేశించి చేసిన ప్రసంగమే అయినప్పటికీ అసంబద్ధమైన వ్యాఖ్యలు, మాటలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..