AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ పాదయాత్ర ముగింపు వేడుకలా మజాకా.. 500 హోటళ్లు.. వేలాది హీటర్లు..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర పంజాబ్‌‌లో కొనసాగుతోంది. పంజాబ్ అనంతరం రాహుల్ జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టనున్నారు.

Rahul Gandhi: రాహుల్ పాదయాత్ర ముగింపు వేడుకలా మజాకా.. 500 హోటళ్లు.. వేలాది హీటర్లు..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Jan 10, 2023 | 6:10 PM

Share

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర పంజాబ్‌‌లో కొనసాగుతోంది. పంజాబ్ అనంతరం రాహుల్ జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టనున్నారు. చివరిగా జమ్మూలో పాదయాత్ర చేయనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ లో ముగియనుంది. ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి ప్రతిపక్షంలోని అన్ని పార్టీల అగ్ర నాయకులను ఆహ్వానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జెకెపిసిసి).. ఈ మేరకు సన్నాహాలను ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులు, కేంద్ర నాయకులతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలను ఆహ్వానించింది. దీంతోపాటు కాంగ్రెస్ తో జతకట్టే పార్టీలను కూడా ఆహ్వానాలు పంపుతుంది.

పంజాబ్‌లో ఎనిమిది రోజుల పాదయాత్ర ముగిసిన అనంతరం జనవరి 20న జమ్మూకశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. అనంతరం జనవరి 30న శ్రీనగర్‌లో పాదయాత్ర ముగుస్తుంది. పదిరోజుల పాటు సాగే ఈ యాత్రలో కేంద్రపాలిత ప్రాంతంలో 350 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీ లఖన్‌పూర్, జమ్మూ సిటీ, శ్రీనగర్‌లలో జరిగే భారీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. జమ్మూ ప్రాంతం నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో చిన్న చిన్న బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు. అయితే, గణతంత్ర దినోత్సవం రోజున రాహుల్ జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర రాష్ట్ర పునరుద్ధరణ, ఎన్నికలు, నిరుద్యోగం సమస్యలను అజెండాకు ముందుకు సాగనున్నట్లు నేతలు పేర్కొంటున్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ప్రతిరోజూ పాలనా పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని.. ఎన్నికలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ప్రజలు ఆందోళనలు చేసేందుకు ప్రజాప్రతినిధులు లేరని భల్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

“శ్రీనగర్‌లో మా అతిథులకు వసతి కల్పించడానికి, మేము నగరంలో 500 హోటల్ గదులను బుక్ చేశాము. యాత్ర చివరి రోజు మెగా ఈవెంట్‌ నిర్వహిస్తాం.. రాహుల్ గాంధీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, భారత్ జోడో యాత్రికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని JKPCC వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ భల్లా పేర్కొన్నారు. చలి దృష్ట్యా హీటర్లు, ప్రత్యేక వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)తో పొత్తును తెంచుకున్న అనంతరం మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్ 2018 నుంచి ప్రభుత్వం లేకుండానే ఉంది. అయితే, ఈ యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబోబా ముఫ్తీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా ఇతర ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. యాత్రలో పాల్గొనేందుకు పౌర సంఘాలు, యువకులు, సామాజిక కార్యకర్తలను సైతం ఆహ్వానించినట్లు జేకేపీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ తెలిపారు. రాహుల్ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, యాత్ర సజావుగా సాగేందుకు ఎల్జీ మనోజ్ సిన్హా సైతం అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇప్పటికే భద్రతపై సమీక్షించారు. యాత్ర మార్గంలో అదనపు సిబ్బందిని మోహరించనున్నట్లు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం కారణంగా ఇప్పటికే భద్రతను పెంచామని.. రాహుల్ యాత్ర కూడా ప్రవేశిస్తున్నందున అదనపు ఏర్పాట్లు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కాశ్మీర్‌కు చేరుకోగానే భారత్ జోడో యాత్ర మొత్తం 3,500 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేస్తుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022న కన్యాకుమారిలో ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్‌కు ఇది రెండవది. అంతకుముందు, రాహుల్ ఆగస్టు 2021లో రెండు రోజుల పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని సందర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..