Rafale Deal: తెరమీదికి మళ్ళీ రాఫేల్ రచ్చ.. ముడుపుల కథనంతో కస్సుమన్న కాంగ్రెస్.. అసలేంటి మేటర్?

కాంగ్రెస్ నేతలు మరోసారి రాఫేల్ ఆధారంగా కేంద్ర ప్రభత్వంపై ఆరోపణలు షురూ చేశారు. దాంతో అసలింతకూ రాఫేల్ వ్యవహారంలో ఏం జరిగిందనే అంశం ఇపుడు తాజాగా మరోసారి ఆసక్తి రేపుతోంది.

  • Updated On - 8:21 pm, Tue, 6 April 21 Edited By: Team Veegam
Rafale Deal: తెరమీదికి మళ్ళీ రాఫేల్ రచ్చ.. ముడుపుల కథనంతో కస్సుమన్న కాంగ్రెస్.. అసలేంటి మేటర్?
Modi And Rahul Gandhi

Rafale Deal came into Political picture again: రాఫేల్ రచ్చ మరోసారి మొదలైంది. 2016 రక్షణ ఒప్పందం కుదిరిన నాటి నుంచి రాఫేల్ వ్యవహారం ఎప్పుడూ ఏదో రూపంలో వార్తల్లో నానుతూనే వుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశం ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎవరూ పెద్దగా విశ్వసించలేదు. దానికి తోడు రాఫేల్ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడం, రాఫేల్ ఒప్పందాన్ని కాగ్ కూగా అప్‌హోల్డ్ చేయడంతో ఇక రాఫేల్ వ్యవహారం ఎంతమాత్రం రాజకీయం కాబోదని అనుకున్నారు. కానీ తాజాగా ఫ్రెంచ్ పత్రిక ఒకటి రాఫేల్ వ్యవహారంలో భారత్‌లో సంస్థకు సుమారు 8.8 కోట్ల రూపాయలు ముడుపులుగా అందినట్లు కథనాన్ని ప్రచురించింది. దాంతో కాంగ్రెస్ నేతలు మరోసారి రాఫేల్ ఆధారంగా కేంద్ర ప్రభత్వంపై ఆరోపణలు షురూ చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దాంతో అసలింతకూ రాఫేల్ వ్యవహారంలో ఏం జరిగిందనే అంశం ఇపుడు తాజాగా మరోసారి ఆసక్తి రేపుతోంది.

ఫ్రాన్స్‌కు చెందిన దాసో సంస్థ నుంచి 36 రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే ఈ ఒప్పందంపై రాజకీయంగా రచ్చ మొదలైంది. దేశీయంగా ఉన్న హెచ్.ఏ.ఎల్. లాంటి సంస్థలను కాదని ముఖేశ్ అంబానీకి చెందిన సంస్థను ఈ ఒప్పందంలో భాగస్తులను చేయడంపై కాంగ్రెస్ పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు విమర్శలు మొదలు పెట్టాయి. 2016 నుంచి 2019 దాకా రాఫేల్ వ్యవహారం తరచూ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినా ఈ అంశాన్ని లేవనెత్తకుండా రాహుల్ గాంధీ వుండలేదు. అయితే.. రాఫేల్ ప్రధానాంశంగా 2019 ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కనిష్ట స్థాయిని ఎంపీల సంఖ్యను తగ్గించుకుంది. మరోవైపు రక్షణ ఒప్పందం కావడంతో రాఫేల్ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంకోవైపు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కూడా రాఫేల్ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇక రాఫేల్ వ్యవహారంపై మాట్లాడదు అనుకుంటున్న తరుణంలో ఫ్రెంచ్ పత్రిక కథనం మరోసారి రాఫేల్ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చింది.

దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఫ్రెంచ్ మీడియా రాఫేల్ వ్యవహారంలో పది లక్షల యూరోలు (సుమారు 8.8 కోట్ల రూపాయలు) భారత్‌లోకి ఓ బ్రోకర్‌కు దాసో సంస్థ ముడుపులిచ్చిందన్నది తాజా కథనం సారాంశం. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే బీజేపీ ఈ కథనాన్ని కొట్టి పారేసింది. కాంగ్రెస్ నేతల డిమాండ్‌ను కూడా తోసిపుచ్చింది. రాఫేల్‌ కొనుగోళ్ల విషయంలో భారత ప్రభుత్వంలోని వారికి ముడుపులు, కమీషన్ల రూపంలో ఎంతెంత చెల్లించారన్నది తేల్సాలని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 10,17,850 యూరోలను (రూ.8.8 కోట్లు) ముడుపులుగా చెల్లించినట్లు ఫ్రాన్స్‌లోని మీడియా పార్ట్‌లో స్టోరీ ప్రచురితమైంది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు మొదలయ్యాయి.

ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక విభాగం (ఏఎఫ్‌ఏ) దర్యాప్తు నివేదిక ఇదేనని ప్రాన్స్ పత్రిక పేర్కొంది. దాసో సంస్థలో ఏఎఫ్‌ఏ ఆడిట్‌ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైందని స్టోరీలో పేర్కొన్నారు. ఈ కేసును ప్రాసిక్యూటర్లకు ఏఎఫ్‌ఏ నివేదించలేదని కథనంలో వుంది. 2017 నాటి ఖాతాలు పరిశీలించారు. క్లయింట్లకు కానుకలు అనే పద్దు కింద 5,08,925 యూరోలు ఖర్చు చేశారని, కానుక కోసం అంతమొత్తం వెచ్చించడమేంటని పత్రిక ప్రచురించింది. ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం కానుకలకు నిర్దిష్ట పరిమితులేమీ లేకపోవడంతో పెద్ద మొత్తం కానుకల కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. వందల యూరోలు ఖర్చయ్యే వాచీ లేదా ఖరీదైన భోజనాన్ని అందించడం కూడా అవినీతేనని కథనంలో పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద డీల్ జరిగినపుడు డిన్నర్లు జరగడం మామూలేనని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ కారణంగా ఖర్చు అయినా అక్కడి పత్రికలు అవినీతిగానే పేర్కొన్నాయంటూ రచ్చ మొదలు పెట్టారు.

2017 మార్చి 30 నాటి ఒక ఇన్‌వాయిస్‌ను ఏఎఫ్‌ఏకు సమర్పించింది దాసో సంస్థ. భారత్‌కు చెందిన డెఫ్‌సిస్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ అందించిన ఈ ఇన్‌వాయిస్.. మొత్తం ఆర్డర్‌ విలువ (10,17,850 యూరోలు)లో 50 శాతం ఇదేనని పేర్కొన్నారు. రాఫేల్‌ సి యుద్ధవిమానానికి 50 డమ్మీ నమూనాల తయారు చేసి.. ఒక్కో దానికి 20 వేల యూరోలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ నమూనాల తయారీ ఖర్చును క్లయింటుకు కానుక పేరుతో ఖాతాల్లో పేర్కొనడమే ఇపుడు వివాదానికి కారణమైంది. అయితే ఫ్రాన్స్‌లోని కార్పొరేట్‌ శత్రుత్వం కారణంగానే మీడియాలో స్టోరీ వచ్చిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు. డెఫ్‌సిస్‌ సంస్థను నడుపుతున్న సుసేన్‌ గుప్తా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణను కూడా సుసేన్ ఫేస్ చేశారని రవిశంకర్ వాదిస్తున్నారు.

ALSO READ: నాలుగు దశాబ్ధాల సంచలనం.. భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన వైనం