AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Formation Day: నాలుగు దశాబ్ధాల సంచలనం.. భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన వైనం

బీజేపీ ఆవిర్భవించి ఏప్రిల్ 6వ తేదీకి 41వ వసంతాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రస్థానాన్ని ఓ సారి అవలోకనం చేసుకుంటే.. ఎన్నో అంశాలు మనకు కనిపిస్తాయి.

BJP Formation Day: నాలుగు దశాబ్ధాల సంచలనం.. భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన వైనం
Bjp
Rajesh Sharma
|

Updated on: Apr 06, 2021 | 4:43 PM

Share

BJP Formation Day Celebrations: భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party). ఇండియన్ పొలిటికల్ పిక్చర్ (Indian Political Picture)‌లో ఓ సంచలనమనే చెప్పాలి. సరిగ్గా 41 ఏళ్ళ క్రితం ఆవిర్భవించి.. ఆ తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు లోక్‌సభ (Loksabha) సీట్లను మాత్రమే గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (BJP) ఆ తర్వాత రామ మందిర (Ram Mandir) నిర్మాణ అంశం, జై శ్రీరామ్ (Jai Sreeram) నినాదంతో దేశంలో శరవేగంగా విస్తరించింది. ఆ తర్వాత పార్టీ పెట్టిన కేవలం 16 ఏళ్ళలోనే తొలిసారి దేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకుంది. దేశంలో వున్న అన్ని పార్టీలు ఒకవైపు అయితే.. బీజేపీ (BJP) ఒక్కటి మరోవైపు అన్న స్థాయి నుంచి పలు పార్టీలను తమ విధానాల ద్వారా ఆకర్షించి, సంకీర్ణ ప్రభుత్వాల శకంలో విజయవంతమైన పూర్తి కాలం పాలనను అందించిన తొలి పార్టీగా బీజేపీ పేరు గాంచింది. దేశంలో పలు మార్లు కాంగ్రెసేతర (Non-Congress) సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా.. కురు వ‌ద్ధ కాంగ్రెస్ నేతల (Congress Leaders) కుటిల రాజనీతిఙ్ఞత ముందు ఎంతో కాలం మనుగడ సాధించలేకపోయాయి. అలాంటి పరిస్థితిలో 1999లో నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీయే) ప్రభుత్వానికి సారథ్యం వహించి.. పూర్తిగా అయిదేళ్ళ పాటు బీజేపీ పరిపాలనను అందించింది. అయితే పార్టీ మూల సూత్రాలను, సిద్దాంతాలను మిత్ర పక్షాల కోసం పక్కన పెట్టేసింది బీజేపీ అన్న అపప్రధను మూటగట్టుకుంది. 2004లో యూపీఏ (UPA) చేతిలో ఓటమి పాలైన బీజేపీ.. తిరిగి అధికార పగ్గాలను చేపట్టేందుకు పదేళ్ళ కాలాన్ని తీసుకుంది. అయితేనేం.. దేశంలో రాజకీయ సంచలనం నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో తిరుగులేని సంఖ్యాబలంతో వరుసగా రెండు మార్లు దేశ పరిపాలన పగ్గాలను బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ ఆవిర్భవించి ఏప్రిల్ 6వ తేదీకి 41వ వసంతాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రస్థానాన్ని ఓ సారి అవలోకనం చేసుకుంటే.. ఎన్నో అంశాలు మనకు కనిపిస్తాయి.

ఏప్రిల్‌ 6, 1980న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావించింది. కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిగా ఉన్న సంఘ్ పరివార్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ (Hindu) జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి అండగా పని చేయడం ఆనాడే మొదలైంది. ఆర్.ఎస్.ఎస్. (RSS) థింక్ ట్యాంక్ దర్శకత్వంలో దేశంలో రాజకీయ సంచలనంగా ఎదిగింది బీజేపీ. దేశంలో జాతీయ వాదాన్ని పెంపొందించడంతోపాటు హిందూ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణ ఆలోచనతో బీజేపీ ఆవిర్భవించింది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ రక్షణే బీజేపీ భావజాలంగా చెబుతారు. పార్టీ స్థాపన నుంచే భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ (Indian National Congress Party)కి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ మారిపోయింది. కమ్యూనిస్టులు ప్రధాన లక్ష్యంగా బీజేపీని ఎంతగా నిరోధించాలని ప్రయత్నించినా.. తిరుగులేని శక్తిగా ఎదిగింది.

చరిత్రలోకి తొంగి చూస్తే…

1952లో ఏర్పడిన బీజేపీ మాతృ సంస్ధ జనసంఘ్ (Jansangh) ఏర్పాటైంది. దానిని శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee) ఏర్పాటు చేశారు. హిందూ జాతీయవాద సంస్థ ఆర్‌ఎస్ఎస్‌కు రాజకీయ విభాగంగా జనసంఘ్‌ ఆవిర్భవించింది. జనసంఘ్‌ను స్థాపించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1953లో కశ్మీర్ జైలులో మరణించారు. ఆ తర్వాత 24 సంవత్సరాలపాటు జనసంఘ్ కొనసాగింది. ఆవిర్భవించినప్పట్నించి ఏ ఎన్నికల్లోను జనసంఘ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దానికి కారణం ఆనాటి దేశ ప్రజలు స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే దేశానికి పెద్ద దిక్కుగా భావించడమే. తొలి సార్వత్రిక ఎన్నికలలో కేవలం 3 సీట్లనే గెలిచుకుంది జనసంఘ్‌. భారత జాతీయ కాంగ్రెస్‌‌కు సరైన పోటీ ఇవ్వలేకపోయిన జనసంఘ్‌‌కు 1975లో ఇందిర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ ఊతమిచ్చింది. ఇందిరా గాంధీ (Indira Gandhi) నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనసంఘ్ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దాంతో పలువురు జనసంఘ్‌ నాయకులను జైలులో నిర్భంధించింది ఇందిరాగాంధీ సర్కార్.

ఒక్క జనసంఘ్ మాత్రమే కాకుండా జనతా పార్టీ (Janata Party) సహా కమ్యూనిస్టులు ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓటమి పాలైంది. విపక్షాలు మూకుమ్మడిగా విజయం సాధించాయి. అయితే 1977 ఎన్నికలకు ముందు మూడు పార్టీలు కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించాయి. దానికి మొరార్జీ దేశాయ్ సారథ్యం వహించారు. 1977 ఎన్నికల తర్వాత దేశంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ (Morarji Desai) సారథ్యంలో ఏర్పాటైంది. విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee), సమాచార శాఖ మంత్రిగా లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani) బాధ్యతలు చేపట్టారు. అయితే ఇందిరాగాంధీ రాజనీతిఙ్ఞత ముందు మొరార్జీ దేశాయ్ ఎంతో కాలం ప్రధాన మంత్రిగా కొనసాగలేకపోయారు. జనతా పార్టీలో చీలికకు ఇందిర గాంధీ తెరచాటు రాజకీయం జరిపారు. ఆమె ప్రయత్నాలు ఫలించాయి. జనతా పార్టీ నుంచి బయటికి వచ్చిన చౌదరీ చరణ్ సింగ్‌ (Charan Singh)కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనతా పార్టీ పూర్తిగా బలహీన పడడంతో వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతలు ఆ పార్టీని వీడారు. పూర్వపు జనసంఘ్ నేతలంగా బయటికి వచ్చిన కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు. 1980 ఏప్రిల్ ఆరో తేదీన భారతీయ జనతా పార్టీ (Bhartiya Janata Party)ని స్థాపించారు. భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవహరించారు. స్లోగా ఎదుగుతుంది అనుకుంటున్న తరుణంలో 1984 అక్టోబర్ 31వ తేదీన ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సిక్కు అంగరక్షకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి పవనాలు బలంగా వీచాయి. రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించగా.. నాలుగేళ్ళ బీజేపీ కేవలం రెండు సీట్లకు పరిమితమైంది. అలాంటి కీలక సమయంలో బీజేపీ అయోధ్య (Ayodhya Ram Mandir) రామ మందిరం అంశాన్ని టేకప్ చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం యావత్ హిందూ ప్రజల సంకల్పంగా ప్రచారం చేసింది. రామ మందిర అంశంలో మొత్తం సంఘ్ పరివార్ సంస్థలు పాలు పంచుకున్నాయి.

అయోధ్య అంశంతో దేశంలో మెజారిటీ హిందువుల అభిమానాన్ని చూరగొంటున్న సంకేతాలు రావడంతో బీజేపీ అగ్ర నేత అద్వానీ రథ యాత్రకు పూనుకున్నారు. అయితే అంతకు ముందు జరిగిన 1989 ఎన్నికల్లో బీజేపీ అంతకు ముందున్న రెండు సీట్ల నుంచి ఏకంగా 88 సీట్లకు ఎదిగింది. రామ మందిర అంశం బాగా కలిసి వస్తున్న సంకేతాలు రావడంతో అద్వానీ 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ (Somnath) మందిర్ నుంచి అయోధ్య దాకా రథయాత్రకు పూనుకున్నారు. దేశంలో అన్ని ప్రధాన రాష్ట్రాలను కలుపుకుని బీజేపీ రథయాత్రను ప్లాన్ చేసింది. అయితే ఈ రథయాత్ర అయోధ్య చేరక ముందే బీహార్‌లోని సమస్తీపూర్‌లో అద్వానీని అరెస్టు చేశారు. దాంతో బీజేపీ పట్ల, అద్వానీ పట్ల ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరిగింది. 1990 అక్టోబరు 23న రధయాత్ర చేస్తున్న అద్వానీని అరెస్ట్ చేసింది బీహార్‌ ప్రభుత్వం. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు కనిపించాయి. అయితే తుది దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిన దారుణ హత్యకు గురవడంతో కాంగ్రెస్ పట్ల సానుభూతి పెరిగింది. దాంతో బీజేపీ 120 సీట్ల వద్దే ఆగిపోయింది. కానీ పార్టీని స్థాపించిన పదేళ్ళలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి బీజేపీ చేరుకోగలిగింది.

రాజీవ్ హత్యతో సానుభూతి కలిసి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. అయితే రాజకీయ కురువృద్దుడు, రాజకీయ చాణక్యునిగా పేరుగాంచిన తెలంగాణా తేజం పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళ పాటు నడిపించగలిగారు. ఆ తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించిన బీజేపీకి ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అయితే.. తగినంత బలం లేకపోవడం, బీజేపీతో కలిసేందుకు దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవడంతో 1996 మే 16వ తేదీన ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం కేవలం 13 రోజులకే కూలిపోయింది. అయితే.. రాజకీయంగా బీజేపీకి ఏకాకిగా చేశారంటూ లోక్‌సభ వేదికగా పదమూడు రోజుల ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రసంగం యావత్ దేశ ప్రజలను కదిలించింది.

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కర్నాటకకు చెందిన దేవెగౌడ సారథిగా మారి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1979, 1991లలో చేసిన రాజకీయ కుయుక్తులనే కాంగ్రెస్ పార్టీ మరోసారి 1998లో ప్రదర్శించింది. ముందుగా దేవెగౌడను మార్చి ఇంద్రకుమార్ గుజ్రాల్‌ని ప్రధానిని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అదను చూసి యుఎఫ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1998లో మరోసారి లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోను బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది కానీ.. పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. అయితే 1996 కంటే భిన్నంగా ఈసారి బీజేపీ వెంట కొన్ని పార్టీలు కలిసి రావడంతో వాజ్‌పేయి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కొన్ని పార్టీలతో కలిసి జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్‌డీఏ)ను స్ధాపించారు బీజేపీ నేతలు. ఎన్డీయే సారథిగా వ్యవహరించిన అట్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. అయితే 1999 మే నెలలో ఎన్డీయే ప్రభుత్వానికి అన్నా డి.యం.కే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్‌పేయి ప్రభుత్వం పతనమైంది. జయలలిత మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీ నేతల వ్యూహరచన కొంతవరకు పని చేసింది. కాకపోతే.. ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవరిస్తున్న గిరధర్ గొమాంగో ఆనాటికింకా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించకపోవడంతో ఆయనచే ఓటు వేయించిన కాంగ్రెస్ నేతలు వాజ్‌పేయిని పదవీచ్యుతున్ని చేయడంలో విజయం సాధించారు.

అప్పటికే 1996, 1998లలో పూర్తికాలం పదవిలో కొనసాగని వాజ్‌పేయి పట్ల విపరీతమైన సానుభూతి పెరగడంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (NDA) కావాల్సిన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి కొనసాగారు. ఉప ప్రధానిగా లాల్ కృష్ణ అద్వానీ పని చేశారు. అయితే బీజేపీ ప్రధాన సిద్ధాంతాలైన రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేయడం, పరిపాలనలో కాంగ్రెస్ కాలంతో పోలిస్తే పెద్ద భిన్నంగా లేకపోవడంతో 2004 ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (UPA) ఘన విజయం సాధించి అధికార బాధ్యతలను చేపట్టింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోను యుపీఏనే విజయం వరించింది.

మరోవైపు బీజేపీకి ఫ్యూచర్ స్టార్ నేతగా ఎదుగుతూ వచ్చిన ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ 2013లో ప్రధాన మంత్రి క్యాండిడేట్‌గా ప్రొజెక్టు చేయబడ్డారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర దామోదర్ మోదీ.. అప్రతిహతంగా మూడు మార్లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించ గలిగారు. వరుసగా 13 ఏళ్ళ పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అదే ఊపులో ఆయన చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికలలో 281 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అవినీతి రహిత పాలనను అందించిన నరేంద్ర మోదీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు గెలిచే స్థాయికి చేర్చారు. దాంతో రెండో సారి నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టింది బీజేపీ. రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ దూకుడు ప్రదర్శించారు. బీజేపీ చిరకాలంగా చెబుతూ వస్తున్న ఆర్టికల్ 370 రద్దును విజయవంతంగా పూర్తి చేశారు. కశ్మీర్‌ను రెండు భాగాలుగా చేశారు. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని చాటారు. రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆమోదం పొందారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉమ్మడి పౌరస్మృతి తేలేకపోయినా.. ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారు.

బీజేపీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 1980 నుంచి 2004 వరకు ఒకెత్తు.. 2004 నుంచి మరో ఎత్తు అని చెప్పుకోవాలి. తొలి 24 సంవత్సరాలపాటు బీజేపీ అంటే వాజ్‌పేయి, అద్వానీ అన్నట్లుగా పార్టీ నడిచింది. రెండు సీట్ల నుంచి అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. అందులో ఇద్దరు తెలుగు నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా కొనసాగారు. వెంకయ్య నాయుడు రెండు విడతలపాటు బీజేపీ సారథిగా విజయవంతంగా కొనసాగగా.. దళిత నేత బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడై.. ఓ ముడుపుల కేసులో రహస్య కెమెరాలకు చిక్కి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణాలేవైతేనేం 2004 తర్వాత బీజేపీ స్లోగా కునారిల్లిపోయింది. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సంఘ్ పరివార్ మొత్తం బీజేపీ ఫ్యూచర్‌పై ఆత్మవలోకనం చేసుకుంది. వాజ్‌పేయి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం, అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నేతలు వృద్ధులైపోవడంతో ఆర్ఎస్ఎస్.. బీజేపీ అధినాయకత్వంలో గణనీయమైన మార్పులను సూచించింది. దాంతో 2009లో బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ గడ్కరీ నియమితులయ్యారు. ఆయన 2013 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఆయన స్థానంలో యుపికి చెందిన రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ సారథ్య బాధ్యతలు చేపట్టారు.

రాజ్‌నాథ్ సారథిగాను, నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గాను వున్న తరుణంలో 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 272 మ్యాజిక్ ఫిగర్ ‌కాగా.. బీజేపీ సొంతంగా 281 సీట్లను గెలుచుకుంది. మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు వచ్చాయి. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారు. మోదీ ప్రభుత్వంలో రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ఎంపిక కావడంతో బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మోదీ అనుంగు సహచరుడు అమిత్ షాకు అప్పగించారు. ఆయన ఆరేళ్ళ పాటు బీజేపీ సారథిగా వ్యవహరించారు. అమిత్ షా సారథ్యంలో 2019 ఎన్నికలకు వెళ్ళిన బీజేపీ.. తిరుగులేని విజయం సాధించింది. బీజేపీ సింగిల్‌గా 303 సీట్లను గెలుచుకుంది. మోదీ రెండుసారి ప్రధాని అయిన తర్వాత అమిత్ షాను తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి పదవినిచ్చారు. దాంతో ఆయన 2020లో బీజేపీ సారథ్య బాధ్యతలను అప్పటి దాకా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా వున్న జెపీ నడ్డాకు అప్పగించారు. ప్రస్తుతం నడ్డా సారథ్యంలో బీజేపీ 41 ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

ALSO READ: ఇక టార్గెట్ హిడ్మా.. రంగంలోకి అమిత్ షా.. ఇంతకీ ఎవరతను?