West Bengal Assembly Election 2021 Highlights: ఉద్రిక్తం, రసవత్తరం బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు : ముగిసిన పోలింగ్

Venkata Narayana

|

Updated on: Apr 06, 2021 | 7:10 PM

West Bengal, Assam Election 2021 Phase 3 Voting Highlights: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం నేడు...

West Bengal Assembly Election 2021 Highlights: ఉద్రిక్తం, రసవత్తరం బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు : ముగిసిన పోలింగ్
West Bengal Election 2021

West Bengal, Assam Election 2021 Phase 3 Voting Highlights: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం నేడు తుది దశకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మూడో విడుతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని 31 సీట్లకు, అస్సాంలోని 40 స్థానాలకు కూడా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అస్సాంలో ఇదే ఆఖరి పోలింగ్ కాగా.. బెంగాల్‌లో ఇంకా ఐదు విడుతల్లో మొత్తం ఎనిమిది విడుతల్లో పోలింగ్ జరగాల్సిఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. దీంతోపాటు అన్ని పార్టీల అగ్రశ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. మాటల తూటాలతో ప్రచారన్ని హోరెత్తించారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బీజేపీకి, తృతమూల్‌కు అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని కమలం నేతలు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మార్చి 27 నుంచి ప్రారంభమై ఎనిమిది విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ కలిసి పోటీచేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే రెండు పూర్తయి.. ఈ రోజు మూడు విడత ఎన్నికలు జరగుతున్నాయి. ఇంకా ఐదు విడతల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతోపాటు కాంగ్రెస్‌ లెఫ్ట్‌ కూటమి కూడా గట్టి పోటీనిస్తోంది.

31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు..

బెంగాల్‌లో 31 స్థానాల్లో జరగనున్న మూడో దశ ఎన్నికల్లో 205మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 618 కంపెనీల సాయుధ బలగాలను అధికారులు మోహరించారు. ఎన్నికల కోసం అధికారులు 10,871 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 78.5లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అస్సాంలో ఆఖరి పోరు.. 40 స్థానాల్లో.. 337 మంది అభ్యర్థులు…

ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్దదైన అస్సాం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తించాయి. మొత్తంగా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా చివరి విడత మంగళవారం జరుగుతోంది. మొత్తంగా 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ అస్సాం గణ పరిషత్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అస్సాం జతియా పరిషత్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అస్సాంలో మళ్లీ అధికారిన్ని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచించి ముందుకు సాగింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, అంచలిక్ గణ్ మోర్చా, సీపీఐఎంఎల్ పార్టీలతో మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. మూడో దశలో ఇక్కడ 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 337మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Apr 2021 06:55 PM (IST)

    పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతల నడుమ ముగిసిన ఓటింగ్

    పశ్చిమ బెంగాల్‌లో మూడోదశ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఉద్రిక్తతల నడుమ ముగిసింది. మొత్తంగా 31 నియోజవర్గాల్లో పోలింగ్​జరుగగా.. సాయంత్రం 5 గంటల వరకు 77.67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తుది నివేదిక విడుదల చేసింది. కాగా, మొత్తంగా 205 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

  • 06 Apr 2021 06:49 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన అస్సాం శాసనసభ ఎన్నికలు, ఓటింగ్‌ శాతం ఇదీ..

    అస్సాం శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ జరిగిన చివరిది, మూడవ దఫా ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు 337 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈవీఎంలలో ఓటర్లు వారి భవితవ్యాన్నినిక్షిప్తం చేశారు. సాయంత్రం 5.20 గంటల వరకు 78.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • 06 Apr 2021 06:44 PM (IST)

    బెంగాల్, అస్సాంలో సాయంత్రం 5 గంటల వరకూ నమోదైన పోలింగ్ వివరాలు

    5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ : ప‌శ్చిమ బెంగాల్: 76.84 అస్సాం : 78.32

    సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ శాతం : ప‌శ్చిమ బెంగాల్: 67.27 అస్సాం : 68.31

  • 06 Apr 2021 06:39 PM (IST)

    చుట్టాలింట్లో రాత్రంతా ఈవీఎంలతో ఉన్న ప్రభుత్వాధికారి ఉదంతంపై కేంద్రమంత్రి సీరియస్

    బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో ఉన్న ప్రభుత్వ అధికారి ఉదంతంపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మండి పడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో ముందురోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణమన్నారాయన. ఈ క్రమంలో సదరు అధికారి ఇంట్లో ఉన్న అన్ని ఈవీఎంలను, వీవీపాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, కొద్ది రోజుల క్రితం అస్సాంలో బీజేపీ నాయకుడి వ్యక్తిగత వాహనంలో ఈవీఎం తరలించడం కలకలం సృష్టించిన విషయం విధితమే.

  • 06 Apr 2021 06:33 PM (IST)

    బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో ఉన్న ప్రభుత్వ అధికారి

    పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషన్‌.. నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్‌ చేసింది. పోలింగ్‌కు ముందు రోజు సదరు అధికారి తనకు బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో పాటు ఉన్నందుకు గాను బెంగాల్‌​ ఈసీ.. ఆ అధికారిని సస్పెండ్‌ చేసింది. అయితే అధికారి వద్ద ఉన్న ఈవీఎం, వీవీపాట్‌ సామాగ్రిని ఎన్నికల్లో వినియోగించలేదని కూడా ఈసీ వివరణ ఇచ్చింది. ఈ ఘటన ఉలుబేరియా ఉత్తర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని తులసిబీరియా గ్రామంలో జరిగింది. కాగా, ఈ ఘటన అనంతరం జనరల్‌ అబ్జర్వర్‌ నీరజ్‌ పవన్‌ అన్ని ఈవీఎం సీళ్లను పరిశీలించారు.

  • 06 Apr 2021 04:33 PM (IST)

    సీనియర్ మంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం ఎంతంటే..

    అస్సాం సీనియర్ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు హిమంత బిస్వా శర్మ పోటీచేస్తోన్న జలుక్బారి నియోజకవర్గంలో ఈ మధ్యాహ్నం గం. 3:30 వరకు 64 శాతం ఓటింగ్ జరిగింది. చివరిది, మూడవది అయిన ఈ దఫా ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొత్తం 40 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. మొత్తంగా 337 మంది అభ్యర్థులు ఈ దశ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.

  • 06 Apr 2021 04:22 PM (IST)

    అస్సాంలో అత్యధిక, అత్యల్ప పోలింగ్ శాతాలు ఎక్కడెక్కడ నమోదయ్యాయంటే..

    అస్సాం రాష్ట్రంలో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ దక్షిణ సల్మారా లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అక్కడ 76.25 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్‌ను నమోదు చేసింది. ఇక, బజాలి 54.55 శాతం పోలింగ్‌తో అతి తక్కువ ఓటింగ్‌ను నమోదు చేసింది.

  • 06 Apr 2021 04:07 PM (IST)

    అస్సాం ఎన్నికలలో 64.88 శాతం పోలింగ్

    అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మధ్యాహ్నం గం. 3.30 వరకు 64.88 శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ జరుగుతోన్న మూడవది.. చివరి దశ ఎన్నికలు అస్సాం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

  • 06 Apr 2021 02:21 PM (IST)

    టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్‌పై దాడి.. ఈసీకి డెరెక్ ఓబ్రెయిన్ ఫిర్యాదు..

    బెంగాల్‌లోని అరండి -1 బూత్ నెంబర్ 263 మహాలపారాలో టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆపార్టీ నాయకుడు, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో ఆమె వ్యక్తిగత భద్రతా అధికారి తలకు గాయాలయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

  • 06 Apr 2021 02:03 PM (IST)

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం.. ఎంత నమోదైందంటే..?

    నాలుగు రాష్ట్రాలతోపాటు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహవంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ ఆయా రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. పశ్చిమ బెంగాల్ 53.89 శాతం అస్సాం 53.23 శాతం కేరళ 47.28 శాతం పుదుచ్చేరి 53.76 శాతం తమిళనాడు 39.00 శాతం నమోదైంది.

  • 06 Apr 2021 01:29 PM (IST)

    హౌరాలో ముగ్గురు అధికారుల సస్పెండ్..

    బెంగాల్‌లోని ఉల్బీరియాలో తమ బంధువుల ఇంటికి ఈవీఎంలను తీసుకెళ్లి నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు తపన్ కుమార్ సర్కార్, సంజీబ్ మజుందార్, మిథున్ చక్రవర్తిని సస్పెండ్ చేసినట్లు హౌరా డిఎం, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

  • 06 Apr 2021 12:46 PM (IST)

    ముగ్గురు హోంగార్డుల తొలగింపు..

    అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విధులను సక్రమంగా నిర్వర్తించని ముగ్గురు హోంగార్డులను తాత్కాలికంగా తొలగించినట్లు హౌరా జిల్లా ఎస్పీ వెల్లడించారు.

  • 06 Apr 2021 12:44 PM (IST)

    మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.. వివరాలు..

    నాలుగు రాష్ట్రాలతోపాటు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆయా రాష్ట్రాల వారీగా నమోదైన శాతం వివరాలు.. పశ్చిమ బెంగాల్ 34.71శాతం అస్సాం 33.18 శాతం కేరళ 31.62 శాతం పుదుచ్చేరి 35.71 శాతం తమిళనాడు 22.92 శాతం

  • 06 Apr 2021 12:14 PM (IST)

    బీజేపీ మద్దతుదారు తల్లి మృతి.. టీఎంసీపై బీజేపీ ఆరోపణలు

    బెంగాల్ హుగ్లీలోని గౌఘాట్‌లో హింసాయుత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీకి మద్దతు పలుకుతున్న వ్యక్తి తల్లి మృతి చెందింది. ఆమె మృతికి తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  • 06 Apr 2021 11:12 AM (IST)

    వృద్ధురాలకి ఐటీబీపీ జవాన్ సాయం..

    ఓటింగ్‌లో భాగంగా.. దక్షిణ 24 పరగణాలలోని సుందర్బన్ కుల్పి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఒక వృద్ధ ఓటరుకు ఐటీబీపీ జవాన్ సహాయం చేశారు. నడవలేకపోతున్న వృద్ధురాలిని ఎత్తుకొని పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చారు.

  • 06 Apr 2021 11:07 AM (IST)

    ఉదయం 10 గంటల వరకు 14.62 శాతం ఓటింగ్

    పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 10 గంటల వరకు 14.62 శాతం పోలింగ్ జరిగింది. హూగ్లీలో హౌరాలో 17.21 శాతం ఓటింగ్ జరగగా, దక్షిణ 24 పరగణాల్లో 15.53 శాతం ఓటింగ్ జరిగింది.

  • 06 Apr 2021 10:30 AM (IST)

    పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు..

    కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో నాటు బాంబు పేలి ఒక‌రు గాయ‌ప‌డ్డారు. ఇండియ‌న్ సెక్యూల‌ర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) మద్దతుదారులు హింస‌కు దిగిన‌ట్లు టీఎంసీ నేత సౌక‌త్ మొల్లా ఆరోపించారు.

  • 06 Apr 2021 09:34 AM (IST)

    ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా 9గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో 3.21%, తమిళనాడులో 0.24%, పుదుచ్చేరిలో 0.38%, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 4.88% అసోంలో 0.93% శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఈసీ పేర్కొంది.

  • 06 Apr 2021 09:18 AM (IST)

    ఇళ్ల నుంచి బయటకు రండి.. మమతా బెనర్జీ విజ్ఞప్తి

    ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని బెంగాల్ ఓటర్లను సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఓటు వేయాలంటూ కోరారు.

  • 06 Apr 2021 09:06 AM (IST)

    టీఎంసీ నాయకుడి ఇంట్లో ఈవీఎంలు.. సెక్టార్ అధికారి సస్పెండ్

    పశ్చిమ బెంగాల్‌ ఉలుబేరియాలోని టీఎంసీ నాయకుడి నివాసంలో ఈవీఎంలు, వీవీప్యాట్ లు లభించాయి. దీనిపై ఎన్నికల సంఘం సిరీయస్ అయింది. ఈ మేరకు సెక్టార్ ఆఫీసర్‌ను సస్సెండ్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. దీనికి కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది.

  • 06 Apr 2021 08:44 AM (IST)

    ఆలోచనాత్మకంగా ఓటు వేయండి.. టీఎంసీ విజ్ఞప్తి

    మూడవ దశ ఓటింగ్ సందర్భంగా టీఎంసీ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. బంతి ఇప్పుడు మీ కోర్టులో ఉందని.. ఆలోచనాత్మకంగా ఓటు వేయండి అంటూ తృణముల్ కాంగ్రెస్ ఓటర్లను కోరింది.

  • 06 Apr 2021 08:40 AM (IST)

    బెంగాల్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి.. అమిత్ షా..

    బెంగాల్‌లో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం.. బలమైన నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలని హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి బెంగాల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ఆయన ట్విట్ చేశారు.

  • 06 Apr 2021 07:53 AM (IST)

    టీఎంసీ కంచుకోటలో.. పోలింగ్

    పశ్చిమ బెంగాల్‌ మూడో విడతలో 31 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ 31 స్థానాలు కూడా టీఎంసీ కంచుకోటగా పేర్కొంటున్నారు. వీటిలో 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ ఈ సీట్లను పూర్తిగా గెలుచుకుంది. ఒక్క అమ్టా నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది.

  • 06 Apr 2021 07:32 AM (IST)

    యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలి… ప్రధాని మోదీ ట్వీట్..

    యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశాల్లోని ప్రజలు రికార్డు సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.. ముఖ్యంగా యువకులు కదలాలి అంటూ ఆయన ట్విట్ చేశారు.

  • 06 Apr 2021 07:27 AM (IST)

    తప్పకుండా గెలుస్తా.. బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా

    బెంగాల్‌లోని తారాకేశ్వర్ నుంచి తాను తప్పకుండా గెలుస్తానని.. బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్‌గుప్తా ధీమా వ్యక్తంచేశారు. ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు చూస్తుంటే గెలుపు సాధ్యమనుకుంటున్నానని తెలిపారు. కాగా.. స్వపన్ దాస్‌గుప్తా గత నెలలో రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశారు.

  • 06 Apr 2021 07:20 AM (IST)

    అస్సాం.. ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధ దంపతులు

    అస్సాంలో మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా.. కోక్రాజార్‌లోని పోలింగ్ బూత్‌లో వృద్ధ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 06 Apr 2021 07:11 AM (IST)

    బెంగాల్ దంగల్ @ 31

    బెంగాల్‌లో జరిగే 31 అసెంబ్లీ స్థానాల్లో.. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోనే 16 నియోజకవర్గాలు ఉండగా.. హుగ్లీలో 8, హావ్‌డాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి.

  • 06 Apr 2021 07:09 AM (IST)

    పోలింగ్ ప్రారంభం..

    పశ్చిమ బెంగాల్‌, అస్సాంలో మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. బెంగాల్‌లో 31 సీట్లకు, అస్సాంలోని 40 స్థానాలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది. అస్సాంలో ఇదే ఆఖరి పోలింగ్ కాగా.. బెంగాల్‌లో ఇంకా ఐదు విడుతల్లో ఎన్నికలు జరగాల్సిఉంది.

Published On - Apr 06,2021 6:55 PM

Follow us