AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh Naxal Attack: ఇక టార్గెట్ హిడ్మా.. రంగంలోకి అమిత్ షా.. ఇంతకీ ఎవరతను?

మావోయిస్టులు దాదాపు అంతమయ్యరని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Chhattisgarh Naxal Attack: ఇక టార్గెట్ హిడ్మా.. రంగంలోకి అమిత్ షా.. ఇంతకీ ఎవరతను?
Hidma
Rajesh Sharma
|

Updated on: Apr 05, 2021 | 4:39 PM

Share

Chhattisgarh Naxal Attack kills many security forces: సుదీర్ఘ కాలం తర్వాత అంబుష్ అటాక్‌తో ఏకంగా 24 మంది భద్రతా దళాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న చత్తీస్‌గఢ్ మావోయిస్టు హింసోన్మాదం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మావోయిస్టులు దాదాపు అంతమయ్యరని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి అమిత్ షా.. ఈ దాడికి తెగబడిన మావోయిస్టులకు బుద్ది చెబుతామని ప్రకటించడమే కాకుండా తాను స్వయంగా చత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యటనకు తరలి వెళ్ళారు. మరోవైపు ఆ దారుణ దాడిలో ఇప్పటికే 24 మరణించినట్లు ప్రకటించగా.. గల్లంతైన మరో ఏడుగురు జవాన్ల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా మావోయిస్టు నేత హిడ్మాగా భావిస్తున్నారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు హిడ్మాపై 50 లక్షల రివార్డును ఇదివరకే ప్రకటించాయి. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఒకవైపు హోం మంత్రి అమిత్ షా ప్రకటించగా.. మరోవైపు ఎవరీ హిడ్మా? అతని వ్యూహం ఏంటి..? ఎన్నాళ్ల నుంచి మావోయిస్టు గ్రూపులో పని చేస్తున్నాడనే చర్చ ఇపుడు జోరందుకుంది. సాధారణ మిలిటెంట్‌ నుంచి మావోయిస్టు వ్యూహ కమిటీ మెంబర్‌గా అతని ఎదిగిన వైనం ఇపుడు హాట్ టాపికైంది. అంబుష్ దాడుల వ్యూహరచనలో దిట్టగా మారిన హిడ్మానే తాజాగా తెర్రంలో జరిపిన మెరుపుదాడికి స్కెచ్ వేశాడని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెర్రం కొండలు, గుట్టలపై హిడ్మాకు బాగా పట్టుండడం వల్లనే భద్రతా దళాల వైపు భారీగా ప్రాణనష్టం జరిగిందని నిఘా వర్గాలు అంఛనా వేస్తున్నాయి. హిడ్మా అక్కడే ఉన్నాడని ముందుగా పోలీసులకు సమాచారాన్ని వ్యూహాత్మకంగా మావోయిస్టులు చేరవేశారని, హిడ్మాను పట్టుకునేందుకు వచ్చే బలగాలపై ఆంబుష్ అటాక్ చేయాలని ప్లాన్ చేశారని నిఘా వర్గాలు అంఛనా వేస్తున్నాయి.

మావోయిస్టుల ప్లాన్‌కు భద్రతా బలగాలు ఈజీగా చిక్కాయని, మావోయిస్టులు ఊహించినట్లుగానే హిడ్మాను పట్టుకునేందుకు భద్రతా దళాలు పెద్ద సంఖ్యలో తెర్రం కొండలపై వెళ్ళడంతో గుట్టలపై మాటు వేసిన మావోయిస్టులు.. ముందుగా మందుపాతర పేల్చి.. ఆ తర్వాత ఆధునిక ఆయుధాలపై మెరుపు దాడి చేసి సెక్యురిటీ ఫోర్సెస్‌ సిబ్బందిని బలిగొన్నారని సమాచారం. తన వ్యూహరచనతో, యుద్ద తంత్రంతో భద్రతా దళాలను కోలుకోలేకుండా హిడ్మా దెబ్బతీశాడని భావిస్తున్నారు. హిడ్మా కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై కొండలపై నుంచి మూడు వైపులా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యు ఆకారంలో ఫామ్ అయిన మావోయిస్టులు యధేచ్ఛగా కాల్పులకు తెగబడడం వల్లనే ప్రాణనష్టం అధికంగా జరిగిందంటున్నారు. ఇప్పటి వరకు 24 మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు తెలుగు జవాన్లున్నారు. మరో ఏడుగురి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గతంలో కూడా హిడ్మా ప్లాన్ చేసిన కసాపాల్, మినపా ఘటనల్లోను భారీ సంఖ్యలో జవాన్లు మరణించారు.

ఇంతకీ హిడ్మా ఏవరంటే…?

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పువర్తి ప్రాంత గిరిజనుడు మడ్వి హిడ్మా అలియాస్ హిడ్మన్న. ఇతనికి దేవా అనే మరో పేరు కూడా వుందని నిఘా వర్గాలంటున్నాయి. చిన్నప్పటి నుంచి విప్లవభావాలతో పెరిగిన హిడ్మా.. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి కాగానే మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌లో చేరాడు. 1990లో హిడ్మా మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు గెరిల్లా ఆపరేషన్లలో దిట్టగా పేరు సంపాదించుకున్నాడు హిడ్మా. గిరిజనుడు కావడంతో అడవులపై పట్టు సహజంగా వుంది హిడ్మాకు. యుద్ధ నైపుణ్య మెలకువలపై నక్సల్ కేడర్‌కు హిడ్మా శిక్షణ ఇస్తాడని సమాచారం. కూంబింగ్‌ చేసే పోలీస్‌ బలగాలపై, సీఆర్పీఎఫ్‌ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు జరిపించడంలో హిడ్మా ఎక్స్‌పర్ట్ అని అంటున్నారు. ఈ తరహా దాడులను మావోయిస్టులు హిడ్మా డైరెక్షన్‌లోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. అతని కనుసన్నల్లోనే మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం పని చేస్తుందని అంటున్నారు. దేశీయ ఆయుధాలు, ఐఈడీ బాంబుల్ని తయారు చేయడంలో హిడ్మాది అందె వేసిన చేయిగా తెలుస్తోంది.

సాయుధ దాడుల్లో దూకుడుగా వ్యవహరించే హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. హిడ్మాను పట్టించిన వారికి కేంద్ర హోం శాఖ రూ. 40 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో ఛత్తీస్‌గడ్ బీజేపీ ఎమ్మెల్యే భీమా మడవి హత్య కేసులో హిడ్మా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అతనిపై ఎన్‌ఐఏ కేసు కూడా నమోదు చేసింది. తాజా దాడిలో దాదాపు 250 మంది మావోయిస్టు పీఎల్‌జీఏ బెటాలియన్‌ పాల్గొనగా దీనికి హిడ్మా నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు హిడ్మా. ఈ బెటాలియన్‌లో పలువురు మహిళా నక్సల్స్ కూడా వున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకనిగా పేరుగాంచిన హిడ్మా దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీలో (డీకేఎస్‌జడ్‌) సభ్యుడు కూడా. సీపీఐ (ఎం) 21 సుప్రీం మెంబర్‌ సెంట్రల్‌ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా హిడ్మాను ఇటీవల నియమించినట్లు సమాచారం. బస్తర్‌లో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడులకు హిడ్మా నేతృత్వం వహించాడని అంటున్నారు. మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్న హిడ్మా కోసం భద్రతా దళాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. 2013లో ఝిరామ్ ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోత, 2017 ఏప్రిల్‌లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య కాండలతో సహా మొత్తం 26 దాడుల్లో హిడ్మా పాత్ర కీలకమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందుకే భద్రతా దళాలు చాలా కాలంగా హిడ్మా లక్ష్యంగానే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 2018 సెప్టెంబరులో పోలీసులకు లొంగిపోయిన పహద్ సింగ్ ద్వారా హిడ్మాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసుల సేకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని కోసం గాలింపు ముమ్మరమైంది.

పోలీసు బలగాల తననే లక్ష్యంగా చేసుకున్నారని పసిగట్టిన హిడ్మా తన స్థావరాన్ని దక్షిణ సుకుమా ప్రాంతానికి మార్చుకున్నాడని నిఘా వర్గాలకు సమాచారం అందింది. పోలీసుల నుంచి ప్రమాదం పొంచి వుండడంతో హిడ్మాకు మావోయిస్టులు నాలుగంచెల భద్రతను కల్పించారని తెలుస్తోంది. అతడి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అతడికి సంబంధించినవిగా భావిస్తున్న స్థావరాలపై పోలీసులు వరుసగా దాడులు నిర్వహించారు. తాజాగా హిడ్మా సారథ్యంలో మరో మెరుపు దాడి జరగడం, అందులో భారీగా ప్రాణనష్టం జరగడంతో భద్రతా దళాలు మరింతగా అప్రమత్తం అయ్యాయి. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి సోమవారం చత్తీస్‌గఢ్‌ పర్యటనకు వెళ్ళారు. తెర్రం ప్రాంతంలో పర్యటించి భద్రతా బలగాలకు ధైర్యం చెప్పారు. మావోయిస్టులకు త్వరలోనే తగిన బుద్ది చెబుతామని అమిత్ షా ప్రకటించారు.

ALSO READ: అసెంబ్లీల ఎన్నికల పర్వంలో కీలక ఘట్టం.. ఏప్రిల్ 6 పోలింగ్ అత్యంత కీలకం.. ఎందుకంటే?