Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్బీర్ సింగ్ గూఢచర్యం దర్యాప్తులో కీలక వివరాలు.. ఏకంగా 150 పాక్ కాంటాక్ట్స్

పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్ గూఢచర్యం కేసులో అరెస్టయ్యాడు. ISI‌తో సంబంధాలు, 150 పాకిస్తానీ కాంటాక్ట్ నంబర్ల వివరాలు బయటపడ్డాయి. జస్బీర్ పాకిస్తాన్‌కు పర్యటించి ISI అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు భారత సైన్యం కదలికలు, సున్నితమైన సమాచారం పాకిస్తాన్‌కు లీక్ చేసిన అనుమానాలతో దర్యాప్తు కొనసాగుతోంది.

జస్బీర్ సింగ్ గూఢచర్యం దర్యాప్తులో కీలక వివరాలు.. ఏకంగా 150 పాక్ కాంటాక్ట్స్
Jyoti Malhotra - Jasbir Sing
Follow us
Gopikrishna Meka

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 07, 2025 | 7:37 PM

పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌పై గూఢచర్యం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 150 పాకిస్తానీ కాంటాక్ట్ నంబర్లు, ISIతో సంబంధాల వివరాలు బయటపడ్డాయి. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మహ్లాన్ గ్రామానికి చెందిన 41 ఏళ్ల జస్బీర్ సింగ్.. జాన్ మహల్ వీడియో అనే యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు. ఆ చానల్‌కు 11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ట్రావెల్, కుకింగ్ వ్లాగ్‌లు పోస్ట్ చేసే ఈ యూట్యూబర్, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో జస్బీర్ మొబైల్‌లో 150 పాకిస్తానీ కాంటాక్ట్ నంబర్లు గుర్తించారు, వీటిలో ISI ఏజెంట్లు, పాకిస్తాన్ హై కమిషన్ అధికారుల నంబర్లు ఉన్నాయి. జస్బీర్ సింగ్ 2020, 2021, 2024లో పాకిస్తాన్‌కు ఆరు సార్లు పర్యటించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.. పాకిస్తాన్ పర్యటనలో జస్బీర్ సింగ్‌ ISI అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.. లాహోర్‌లో మాజీ పాకిస్తాన్ పోలీసు అధికారి నాసిర్ ధిల్లాన్, జస్బీర్‌ను ISI అధికారులకు పరిచయం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాక, జస్బీర్ తన ల్యాప్‌టాప్‌ను ఒక గంట పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారికి అప్పగించినట్లు దర్యాప్తు లో చెప్పాడు..

యుట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్‌‌కు సంబంధాలు

గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానా యుట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జస్బీర్ సింగ్, జ్యోతి మల్హోత్రాతో కలిసి 2024లో లాహోర్‌లో 10 రోజుల పాటు గడిపారు… జ్యోతి కూడా గూఢచర్యం ఆరోపణలపై గత నెలలో అరెస్టయింది. ఈ ఇద్దరూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ దౌత్యవేత్త ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ ద్వారా పరిచయమయ్యారు. డానిష్, ISI హ్యాండ్లర్‌గా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పెరుగుతున్న గూఢచర్యం అరెస్టులు

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉగ్రవాదులు, ఉగ్రవాదుల సానుభూతిపరులు, గూఢ చారులు, స్లీపర్ సెల్స్ నెట్ వర్క్ పై భారత ఏజెన్సీలు దృష్టి సారించాయి. గడిచిన నెల రోజుల్లో ఇప్పటివరకు సుమారు 20 మందిని ఉత్తరాది రాష్ట్రాలనుంచి పోలీసులు అరెస్ట్ చేశారు..ఇప్పటి వరకు జ్యోతి మల్హోత్రా ,దేవేంద్ర సింగ్ ,హర్మాన్, షజాద్,గుజ్లా  ,యామిన్ మొహమ్మద్, పాలక్ షేర్ మాషియా, సూరజ్ మాషియా, నుమానుల్లా,మూర్తజ్ అలీ, ఖాసిం, సహకుర్ ఖాన్,గగన్ దీప్ సింగ్,జస్బీర్ సింగ్ సహా పలువురు కీలకంగా ఉన్నారు.. ఈ గూఢచర్య రాకెట్‌లో భాగంగా జస్బీర్ సింగ్ భారత సైన్యం కదలికలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అతని డిజిటల్ డివైస్‌లలోని డేటాను తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా పోలీసులు ఆ డేటాను రికవరీ చేసే పనిలో ఉన్నారు… గూఢ చర్యానికి పాల్పడుతున్న యుట్యూబర్ అరెస్టులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఉపయోగించి ISI నిర్వహిస్తున్న కొత్త రకం గూఢచర్య వ్యూహాన్ని వెల్లడిస్తోంది. పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఈ గూఢచర్య కార్యకలాపాలు మరింత తీవ్రమైనట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు..ఆఫీసియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద గూఢచార్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దేశ భద్రతకు సంబంధించి ఏ అంశాలను పాకిస్తాన్ ఐఎస్ఐ తో పంచుకున్నారన్న కోణంలో డిజిటల్ డిజిటల్ ఎవిడెన్స్‌ల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..