AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune Porsche accident: పుణే హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం..

పుణే ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు వేదాంత్‌కు మైనర్‌ అన్న సాకుతో బెయిల్‌ రావడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో వేదాంత్‌ బెయిల్‌ను రద్దు చేసింది జువైనల్‌ బోర్డు. తండ్రి విశాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనకు కోర్టు రెండు రోజుల రిమాండ్‌ విధించింది. ఇద్దరు టెకీల ప్రాణాలు తీసిన వేదాంత్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Pune Porsche accident: పుణే హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం..
Pune Porsche Accident
Ram Naramaneni
|

Updated on: May 23, 2024 | 9:11 AM

Share

కండకావరంతో యాక్సిడెంట్‌ చేసి రెండు నిండు ప్రాణాలను బలిగొన్న 17 ఏళ్ల వేదాంత్‌ అగర్వాల్‌ను మైనర్‌ అన్న సాకుతో బెయిల్‌పై వదిలేయడంపై పుణేలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొడుకును తాగుబోతుగా తయారు చేసిన రియల్టర్‌ తండ్రి విశాల్‌ అగర్వాల్‌ జనం తిరగబడుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి పారిపోయేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే జీపీఎస్‌ ఆధారంగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైనర్‌కు కారు ఇచ్చిన ఆరోపణలపై విశాల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసులు విశాల్‌ను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో స్థానికులు ఇంక్‌ చల్లి నిరసన తెలిపారు.

వేదాంత్‌ కారు ఢీకొట్టడంతో గత శనివారం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు దుర్మరణం పాలు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం మత్తులో కారునడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన వేదాంత్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అశ్విని కోశ్తా , అనీశ్‌ అవధియా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

“యాక్సిడెంట్‌ కేసులో ప్రధాన నిందితుడి తండ్రిని కోర్టులో హాజరుపర్చారు. తండ్రిగా అతడు సరైన బాధ్యతలు నిర్వర్తించలేదు. కుమారుడికి మంచి ప్రవర్తన నేర్పించలేదు. 18 ఏళ్లు నిండని వాళ్లను పబ్‌కు పంపడం నేరం. లైసెన్స్‌ లేనప్పటికి కారును ఇవ్వడం కూడా నేరమే. అందుకే తండ్రిగా తప్పు చేసినందుకు బెయిల్‌ను వ్యతిరేకించాం. కోర్టు ఆయనకు ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది” అని లాయర్ తెలిపారు.

పుణే ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి రెండు పబ్‌లకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం గంటన్నర సమయంలో రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు. తరువాత తిరిగి గి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వేదాంత్‌ అగర్వాల్‌కు 25 ఏళ్ల వచ్చే వరకు డ్రైవింగ్‌ లైసెన్స్ ఇవ్వరాదని మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వివేక్ భిమన్వార్‌ తెలిపారు. తడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. వేదాంత్‌ తండ్రి విశాల్‌ పుణేలో బడా రియల్టర్‌. రూ. 600 కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడుపుతున్నాడు. నిందితుడైన ఆ మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అతడి బెయిల్‌ను రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, అతడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.