Puducherry: సీఎం, గవర్నర్ ఇళ్లకు కరెంట్ కట్.. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో అంధకారంలో పుదుచ్చేరి..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల నిరసన ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం రంగస్వామికి సైతం తగిలింది. ఉద్యోగులు ముఖ్యమంత్రి, గవర్నర్ ఇళ్లకు కూడా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఒక్కసారిగా సరఫరా ఆగిపోవటంతో విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. కరెంట్ లేక పుదుచ్చేరి అంధకారంలో మునిగిపోయింది. సాయంత్రం 6 గంటల తర్వాత కరెంట్ లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఈ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు జనం కూడా రోడ్లపైకి వచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే 100 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. కాగా.. రంగస్వామి సర్కారు విద్యుత్తు పునరుద్ధరణకు వెంటనే చర్యలు ప్రారంభించింది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పోలీసులు, ఇతర సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దింపి విద్యుత్ పునరుద్ధరణ చేపట్టింది. ఈ క్రమంలో ఆందోళనకారులు సబ్‌స్టేషన్ల వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో వంద శాతం ప్రైవేటీకరణకు కేంద్రం అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పుదుచ్చెరి రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై కేంద్రం కూడా రంగంలోకి దిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు కూడా పుదుచ్చేరి చేరుకుని ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. మంత్రి నమశ్శివాయమ్ ఇవాళ అఖిలపక్షం సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నమశ్శివాయం చెప్పారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి పరిపాలనా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా.. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించారు. సమ్మె ప్రభావంపై ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..