AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లారని వివాదం.. జామా మసీద్ వద్ద ఉద్రిక్తత.. ప్రార్థనలు ముగిశాక నిరసనలు

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూపీ, ఢిల్లీలో ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన జామా(Jama Masjid) మసీదు వెలుపల ఢిల్లీలో నిరసనలు...

చల్లారని వివాదం.. జామా మసీద్ వద్ద ఉద్రిక్తత.. ప్రార్థనలు ముగిశాక నిరసనలు
Jama Masjid
Ganesh Mudavath
|

Updated on: Jun 10, 2022 | 4:14 PM

Share

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూపీ, ఢిల్లీలో ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన జామా(Jama Masjid) మసీదు వెలుపల ఢిల్లీలో నిరసనలు చెలరేగాయి. నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే పలువురు మసీదు వెలుపలకు వచ్చి, బీజేపీకి(BJP) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. చిన్నపిల్లలతో సహా వందల మంది నూపుర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. ఈ నిరసనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జామా మసీద్‌ నిర్వాహకులు వెల్లడించారు. జామా మసీద్‌తో పాటు యూపీ, సహారన్‌పూర్‌, మోరాదాబాద్‌ మసీదుల వద్ద కూడా శుక్రవారం ప్రార్థనల తర్వాత నూపుర్‌ కామెంట్లపై నిరసనలు చేపట్టారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత జామా మసీదు వెలుపల ఢిల్లీలో నిరసలు చెలరేగాయి. నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్ వంటి ఇతర నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టు చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దేశంలోని అధికార పార్టీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యలపై అనేక ముస్లిం మెజారిటీ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా పోస్ట్‌ చేసినందుకు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌పై బీజేపీ వేటు వేసింది. ఈ ఘటనపై దుమారం రేగడంతో నూపుర్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అదే సమయంలో వేర్వేరు చోట్ల వీళ్లపై కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వివాదం చల్లారడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి