India News: గంజాయి సాగును, అక్రమ రవాణాను అడ్డుకోవడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న గంజాయిని చూస్తుంటే.. మన దేశంలో యువత ఇంతగా ఈ మాయదారి మత్తుకు అటవాటు పడ్డారా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లోని సుక్మా జిల్లా(Sukma district)లో జాతీయ రహదారి 30పై ఉన్న వంతెన కింద జవాన్లు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి మొత్తం విలువ దాదాపు 24 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులకు భయపడి స్మగ్లర్లు 9 బస్తాల గంజాయిని వంతెన కింద దాచి ఉంచినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని చింద్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఛింద్‌గఢ్‌కు చెందిన CRPF జవాన్లు, జిల్లా పోలీసు సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. సెర్చింగ్ అనంతరం తిరిగి వస్తుండగా… రాజముండ సమీపంలోకి చేరుకునే సమయంలో.. అక్కడ జాతీయ రహదారి 30పై ఉన్న వంతెన కింద ఉంచిన బస్తాలు సైనికుల కంటపడ్డాయి. వెళ్లి చూసేసరికి ఆ బస్తాల నిండా గంజాయి నింపి ఉంది. సైనికులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్తాలకు దుమ్ము పట్టి ఉండటం చూసిన పోలీసులు 2, 3 నెలల క్రితమే గంజాయిని అక్కడ దాచి ఉంచి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిత్యం వచ్చి వెళ్లే వాహనాలలో తనిఖీలు జరుగుతుండటం వల్ల స్మగ్లర్లు భయపడి ఈ గంజాయిని వంతెన కింద దాచి ఉంచి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..