Pawan Kalyan: కోనసీమ క్రాప్ హాలీడే పాపం YCPదే.. జనసేన చీఫ్ పవన్ ధ్వజం

Janasena Party Chief Pawan Kalyan: అన్నంపెట్టే అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. అన్నదాతలు క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

Pawan Kalyan: కోనసీమ క్రాప్ హాలీడే పాపం YCPదే.. జనసేన చీఫ్ పవన్ ధ్వజం
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 10, 2022 | 12:15 PM

కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  స్పందించారు.  వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ధ్వజమెత్తారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. అలాగే  కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ధ్వజమెత్తారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వకపోవడం వంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందని అన్నారు. కోనసీమలో దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమన్నారు. అన్నంపెట్టే అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అన్నదాతలు క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

తనకు తెలిసి 2011లో ఒకసారి మాత్రమే కోనసీమలో క్రాప్ హాలిడే జరిగిందని పవన్ పేర్కొన్నారు. నాడు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని.. గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసిందని గుర్తుచేశారు.  దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని అప్పట్లో కొన్ని మార్గనిర్దేశకాలు చేశారని అన్నారు. ఇప్పుడు 11 ఏళ్లు తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని అన్నారు. దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

భయపడి రాత్రికి రాత్రి డబ్బులు వేశారు..

ఇవి కూడా చదవండి

కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించడానికి వైసీపీ చేసిన తప్పులే కారణమని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని విమర్శించారు.  దాదాపు రూ. 475 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. రైతులు పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రి వారి ఖాతాల్లో రూ. 139 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పంట కాలువలను, డ్రెయిన్లను ప్రభుత్వం మరమ్మతులు చేయడంలేదని ఆరోపించారు. పూడికతీత, గట్టు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతుల నుంచి వినిపిస్తోన్న ప్రధాన డిమాండ్ కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయి… జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు.. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఎందుకో కార్యరూపం దాల్చలేదని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితోనే ఈ రోజు కోనసీమ రైతాంగానికి ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.

రైతులపై చౌకబారు విమర్శలు సరికాదు.. 

పంట విరామం ప్రకటించిన రైతులపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం చౌకబారుతనంగా ఉందని పవన్ ఎద్దేవా చేశారు. ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్లనూ ఇలానే తిట్టారని విమర్శించారు. అలాగే తల్లిదండ్రుల మార్గనిర్దేశం సరిగాలేకనే 10వ తరగతి విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని వైసీపీ నేతలు నిందించారని అన్నారు. ఆడబిడ్డ మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని విమర్శలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యత లేదని కామెంట్లు చేశారని గుర్తుచేశారు. ఇలా ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడటం తప్ప… సమస్యను పరిష్కరించే మనస్తత్వం వీళ్లకు లేదంటూ ధ్వజమెత్తారు.  పంట విరామం ప్రకటించిన రైతాంగంపై వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం  బాధాకరమన్నారు.  రైతు సోదరులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు.  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని పవన్ హామీ ఇచ్చారు.

కోనసీమ రైతుల క్రాప్ హాలిడే‌పై పవన్ కల్యాణ్ ప్రకటన..

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..