Presidential Elections 2022: అందుకే రాష్ట్రపతి ఎన్నికలకు శరద్ పవార్ దూరం.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపడంపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినా.. ఎవరిని నిలపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోకుండానే విపక్షాల సమావేశం ముగిసింది.
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢిల్లీలో బుధవారం జరిగిన విపక్షాల సమావేశంలో శరద్ పవార్ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించారు. కాంగ్రెస్, వామపక్షాలు, శివసేన తదితర పార్టీలు ఆయన అభ్యర్థిత్వానికి మద్ధతు తెలిపాయి. అయితే తనకు ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ మిగిలే ఉందంటూ శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపడంపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినా.. ఎవరిని నిలపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోకుండానే విపక్షాల సమావేశం ముగిసింది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను విపక్షాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
విపక్షాల తరఫున బరిలో నిలిచే ఉమ్మడి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునేందుకు విపక్ష నేతలు మరోసారి శనివారం (ఈ నెల 18న) ఢిల్లీలో సమావేశంకానున్నారు. కాంగ్రెస్, తృణముల్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫెరెన్స్, జేడీఎస్, డీఎంకే, జేఎంఎం, పీడీపీ, ఆర్ఎల్డీ తదితర 16 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, వైసీపీ తదితర పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నుంచి శరద్ పవార్ తప్పుకోడంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ గొప్ప నాయకుడని కొనియాడుతూనే.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని ఆయనకు బాగా తెలుసన్నారు. అందుకే ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని పవార్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆయన పేరును విపక్షాలు చర్చించడం సరికాదన్నారు. అదే సమయంలో ఏకాభిప్రాయంతో రాష్ట్రపతి ఎన్నిక జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని రాందాస్ అథవాలే విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..