Power Crisis: ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం.. బొగ్గు కొరతకు అసలు కారణం అదేనా?..

Power Crisis: దేశంలో ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి..

Power Crisis: ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం.. బొగ్గు కొరతకు అసలు కారణం అదేనా?..
Power Cuts
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2022 | 4:07 PM

Power Crisis: దేశంలో ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్‌ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్‌ చేయడానికి థర్మల్‌ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్‌ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్‌ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్‌ అవసరాలను 70% థర్మల్‌ పవర్‌ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్‌ కట్‌లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్‌ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. వడగాలులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 9న 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏప్రిల్ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. 1901లో రోజువారీ ఉష్ణోగ్రతల లెక్కింపు ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.

దేశంలో 150 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉండగా.. 81 కేంద్రాల్లో నిల్వలు తీవ్రస్థాయికి చేరాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో గృహ అవసరాలకు విద్యుత్ వాడకం ప్రమాదంలో పడింది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 54 ప్లాంట్లలో 28 కేంద్రాల్లో కొరత తీవ్రస్థాయికి స్థాయికి చేరిందని వివరించింది.

అయితే.. దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం విశేషం. ప్రస్తుతం కోల్‌ ఇండియా వద్ద 72.5 మిలియన్‌ టన్నులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద మరో 22 మిలియన్‌ టన్నుల మేర నిల్వలు ఉన్నాయని తెలిపాయి. రోజూ సగటున 2.1 మిలియన్‌ టన్నుల బొగ్గు ప్లాంట్లకు వస్తోందని, బొగ్గు కొరతకు అవకాశమే లేదని వెల్లడించాయి. పవర్‌ ప్లాంట్ల వద్ద 10 రోజులకు సరిపడా నిల్వలు ఉండగా.. మొత్తంగా 30 రోజులకు అవసరమైన నిల్వలు ఉన్నాయని చెప్పాయి. నేషనల్‌ పవర్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్‌ కోల్‌ బేస్డ్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్‌ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్‌ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయని చెబుతోంది.

ఈ విద్యుత్‌ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్‌ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్‌ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read:

AP Weather Alert: మండుటెండల్లో చల్లని కబురు.. ఆ ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు..

Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..

Saudi King: హాలీవుడ్ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ ప్రకటించిన సౌదీ రాజు.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?