Cow: ఆవు కోసం అలుపెరగని పోరాటం.. న్యాయపోరాటంతో గెలిచిన రాజస్థానీ ఆదర్శ రైతు కథ ఇది..
ఆవులపై రైతులకుండే మమకారం అంతా ఇంత కాదు. సొంత సంతానంలా చూసుకుంటారు వాటిని. అలాంటి ఆవును ఎవరైనా దొంగిలిస్తే దాన్ని తిరిగి సాధించే వరకు ఊరుకోరు. అలాంటి రైతు కథే ఇది. దీని కోసం దొంగ అనే అపవాదును ఎదుర్కొన్నారు. ఆవు కోసం లక్షల రూపాయల విలువ చేసే పొలాన్ని అమ్ముకున్నారు. కాని, ఆవు కోసం పట్టుదలను వీడలేదు. శాస్త్రీయ పరీక్షలకు సిద్ధమయ్యారు. చివరకు విజయం సాధించారు. ఆవును చూసి మురిసిపోయారు.

సత్యమేవ జయతే అంటే సత్యానిదే జయమని, నిజమే గెలుస్తుందని దీనర్థం. న్యాయం జరగడంలో ఆలస్యం ఉంటుందేమో కాని జరగకపోవడమనేది ఉండదు అని చెప్పేందుకు ఉదాహరణ ఈ రైతు, ఈ ఆవు. ఆవు, దూడను చూసి మురిసిపోతున్న ఈ రైతు పేరు దులారామ్. వయస్సు 70 సంవత్సరాలు ఉంటుంది. ఉండేది రాజస్థాన్‌లోని చురు సమీపంలోని సర్దార్ మహల్ ప్రాంతం. పట్టుదలకు మారు పేరని తెలిసిన వాళ్లంతా ఈయన గురించి గొప్పగా చెప్తారు. అది నిజమే మరి. తన ఆవు విషయంలో ఈ తాతగారు చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. దులారామ్‌కు చెందిన ఆవు ఒకటి ఫిబ్రవరి 11, 2021న చోరీకి గురైంది. వాళ్ల ఇంటికి సమీపంలోని వ్యక్తే దాన్ని దొంగలించారని దులారామ్ గుర్తించారు. వాళ్లతో మాట్లాడి తన ఆవు తాను తిరిగి తెచ్చుకునేందుకు గ్రామస్తుల సహకారంతో ఎంతో ప్రయత్నించారు.
కాని అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో దులారామ్ డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవు కనిపించకుండాపోయి 10 నెలలు అవుతుందని ఇప్పుడేం కేసని పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. కాని దులారామ్ పట్టువదలకుండా ప్రయత్నించడం, జిల్లా ఎస్పీ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లడంతో డిసెంబర్ 21, 2021న పోలీసులు FIR నమోదు చేశారు. కాని వెంటనే పోలీసులు దీనిపై ఫైనల్ రిపోర్టు ఇచ్చారు. అదేంటి ఆవు ఎక్కడుందో తేల్చకుండా కేసు ఎలా మూసేస్తారని పోలీసులకు చెప్తే ఈ పెద్దాయనను వాళ్లు కొట్టినంత పనిచేశారు. అదే సమయంలో ఆవును దొంగిలించిన వ్యక్తి దులారామ్‌ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
న్యాయం కోసం ఎంతో పోరాటం చేశాను. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నా మాట ఎవరూ వినలేదు. నా మీద మూడుసార్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నన్ను బద్‌నామ్ చేశారు. డబ్బులు తిని ఎఫ్‌ఐఆర్ రాయించారు. తన ఆవు తనకు తిరిగి ఇవ్వకపోవడం అటుంచి తనపైనే దొంగతనం ఆరోపణలు చేయడంతో తల్లడిల్లిన దులారామ్ తన ఇంటి సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. అదే రోజు సర్దార్ షహర్‌కు సీఎం అశోక్ గెహ్లోత్ వస్తుండటంతో హైరానా పడిన పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మాట ఇవ్వడంతో దులారామ్ శాంతించారు. పెద్దాయన మొండి పట్టుదల చూసిన పోలీసులు కూడా కంగుతిన్నారు. ఆవును తిరిగి ఇప్పించేందుకు DNA సేకరించి దాన్ని హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టు ఆధారంగా ఆ ఆవు దులారామ్‌దేనని నిర్థారించారు. ఇలా ఆవును గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు
నాకు తెలిసినంత వరకు సర్దార్ షహర్‌లో ఇలా డీఎన్‌ఎ పరీక్ష విజ్ఞప్తి రావడం బహుశా ఇదే మొదటిసారి. పశువులకు సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇలాంటి డీఎన్‌ఎ పరీక్షలు ఇంతకు ముందు ఎప్పుడు జరిగినట్టు లేదు. ఈ ఆవు జనవరి 26న పుట్టడంతో దానికి భారత్ మాత అని పేరు పెట్టారు దులారామ్. ఈ రెండేళ్ల కాలంలో ఆ ఆవుకు రెండు దూడలు పుట్టాయి, వాటిని కూడా పోలీసులు దులారామ్‌కు అప్పగించారు.
ఈ కేసు విచారణ చేపట్టాలని ఐజీ నన్ను ఆదేశించారు. నేను ఆ ఆవు డీఎన్‌ఎ శాంపిల్ సేకరించాను. దులారామ్ దగ్గరున్న దాని తల్లి నుంచి కూడా డీఎన్‌ఎ తీసుకున్నాం. ఆ శాంపిల్స్‌ను నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌కు పంపించాం. హైదరాబాద్ నుంచి రెండు రోజుల క్రితం రిపోర్టు వచ్చింది. ఆ రెండు ఆవులు తల్లిబిడ్డలను అందులో తేలింది. గంగారామ్ ఇంట్లో ఉన్న ఆవును, ఈ రెండేళ్ల కాలంలో దానికి పుట్టిన రెండు దూడలను దులారామ్‌కు అప్పగించాం.
ఇదంతా అంత తేలిగ్గా ఏం జరగలేదు. 20 వేలు ఖరీదు చేసే ఈ ఆవు కోసం దులారామ్ లక్షలు ఖర్చు పెట్టారు. ఆవు కోసం దాదాపు 6 ఎకరాల విలువైన పొలాన్ని అమ్మారు. కాని, తన ప్రయత్నం ఫలించి తన భారతమాతకు తనకు తిరిగి దక్కడంపై ఇప్పుడు ఆనందంతో మురిసిపోతున్నారు. అన్నట్టు తన ఫిర్యాదును పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇప్పడు కొత్త పోరాటం మొదలుపెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం