Karnataka: తాళ్లతో కట్టేసి బలవంతంగా పురుగుల మందు తాగించారు.. సంచలనంగా మారిన పరువు హత్య..
కర్నాటకలో సంచలనంగా మారిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గోనె సంచిలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పలు షాకింగ్ విషయాలు..
కర్నాటకలో సంచలనంగా మారిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గోనె సంచిలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అయితే యువకుడితో పాటు యువతి కూడా చనిపోయిందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. విజయపుర జిల్లా తికోటా పరిధిలోని ఘోణసగి గ్రామానికి చెందిన యువకుడు జమఖండి, కల్లవటగి ప్రాంతానికి చెందిన యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరు విజయపురలోని ఓ కళాశాలలో చదువుతున్నారు. రోజూ కాలేజీకి బస్సులో వెళ్లేవారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి జమఖండి వెళ్లాడు. ఆమెను పొలానికి తీసుకువెళ్లాడు. దీనిని యువతి తండ్రి గుర్తించాడు. వెంటనే అలర్ట్ అయ్యి వారు ఉన్న రూమ్ కు తాళం వేసేశాడు. తండ్రి తనను చూసేశాడన్న భయంతో ఆ యువతి అక్కడే ఉన్న పురుగుల మందును తాగేసింది. పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది.
వారిద్దరిని రూమ్ లో పెట్టి తాళం వేసి గ్రామంలోకి వెళ్లిన యువతి తండ్రి.. బంధువులను ఘటనాస్థలానికి తీసుకెళ్లాడు. తన కుమార్తె చనిపోయి ఉండటం చూసి షాక్ అయ్యాడు. జమఖండే తన కుమార్తెను చంపేశాడిని భావించి అతనిని స్తంభానికి కట్టేశారు. అంతే కాకుండా బలవంతంగా పురుగుల మందు తాగించారు. దీంతో అతను కూడా చనిపోయాడు. వీరిద్దరి మృత దేహాలను వేర్వేరు సంచుల్లో కట్టి కృష్ణా నదిలో పడేశారు. అనంతరం ఏమీ ఎరగనట్లుగా యువతి కనిపించడం లేదని తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. తమ కుమారుడు కూడా కనిపించడం లేదని జమఖండి తల్లిదండ్రులు మరో కేసు నమోదు చేశారు.
ఇరు కుటుంబాల ఫిర్యాదుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమ వ్యవహారమే వీరి అదృశ్యానికి కారణమై ఉంటుందని భావించి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్టోబరు 10న బీళగి వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించింది. అతను ధరించిన టీ షర్ట్ ఆధారంగా ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య అని తేలింది. ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి కస్టడీకి అప్పగించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి