AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. 3 రోజుల్లో 3 దేశాలు, 25 సమావేశాల్లో ఫుల్ బిజీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం మధ్య జరుగుతున్న ఈ పర్యటనలో మూడు రోజుల్లో మూడు యూరోపియన్ దేశాలైన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

PM Narendra Modi: ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. 3 రోజుల్లో 3 దేశాలు, 25 సమావేశాల్లో ఫుల్ బిజీ..
Pm Modi
Venkata Chari
|

Updated on: May 01, 2022 | 6:00 AM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మే 2న ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉక్రెయిన్(ukraine) సంక్షోభం మధ్య జరుగుతున్న ఈ పర్యటనలో మూడు రోజుల్లో మూడు యూరోపియన్ దేశాలైన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సమయంలో 25 సమావేశాలో పాల్గొననున్నారు. ఇందులో రాజకీయ దృక్కోణంలో 7 దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ నాయకులను మోదీ కలవనున్నారు. అలాగే దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి 50 కంపెనీల వ్యాపార అధిపతులను కలుస్తారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితిలో భారతదేశం(India) తటస్థ వైఖరి, రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్ దేశాల సంఘీభావం దృష్ట్యా ఈ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భారతదేశం వైపు స్పష్టత ఇవ్వడానికి మాత్రమే ప్రధాన మంత్రి మోదీ కఠినమైన షెడ్యూల్ నిర్ణయించారని భావిస్తున్నారు.

మూడు రోజులు.. మూడు దేశాల్లో..

మూడు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు దేశాల్లో 65 గంటలు గడపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో, 8 మంది ప్రపంచ నాయకులతో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల మధ్య, 50 గ్లోబల్ బిజినెస్ లీడర్‌లతో ఆయన సమావేశానికి సమయం కూడా ప్లాన్ చేసుకున్నారు.

ప్రధాని మొదటగా మే 2న జర్మనీకి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారు. అనంతరం మే 3న డెన్మార్క్ వెళ్లి రాత్రి బస అక్కడ చేయనున్నారు. పీఎం మోదీ మే 4న తిరిగి వస్తారు. ఈ సమయంలోనే ఫ్రాన్స్ చేరుకుంటారు. అక్కడ పారిస్‌లో ఫ్రెంచ్ నాయకులు, వ్యాపార వర్గాలతో సమావేశమవుతారు.

ఈ పర్యటనలో ప్రధాని మోడీకి చాలా కఠినమైన సమావేశ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రతి విదేశీ పర్యటనలో ప్రవాస భారతీయులను కలిసే సంప్రదాయాన్ని కూడా ఆయన పాటించనున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులతో కూడా ప్రధాని సమావేశమవుతారు.

బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్షన్స్ (ఐజీసీ) ఆరో వేడుకలో కూడా ఇద్దరు నేతలు పాల్గొంటారు. IGC అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ద్వైపాక్షిక సంభాషణ. ఇందులో ఇరు దేశాల మంత్రులు కూడా పాల్గొంటారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ప్రధాని మోదీకి ఇది మొదటి IGC సమావేశం కానుంది. ఈ సమయంలో, ప్రధాన మంత్రి, ఛాన్సలర్ స్కోల్జ్ ఉమ్మడి వ్యాపార కార్యక్రమంలో కూడా ప్రసంగిస్తారు.

డెన్మార్క్‌లో జరిగే ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో..

డెన్మార్క్‌ ప్రధాని మేట్‌ ఫ్రెడరిక్‌సన్‌ ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కోపెన్‌హాగన్‌లో జరిగే రెండో ఇండియా-నార్డిక్ సమ్మిట్, ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో మోదీ పాల్గొంటారు. రెండవ ఇండియా-నార్డిక్ సమ్మిట్ సందర్భంగా, ప్రధాని మోదీ ఐస్‌లాండ్ ప్రధాని కాట్రిన్ జాకబ్స్‌డోటిర్, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్, స్వీడన్ పీఎం మాగ్డలీనా ఆండర్సన్, ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్‌లను కలుస్తారు.

ఈ శిఖరాగ్ర సమావేశంలో, కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, ఆవిష్కరణ-సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, ప్రపంచ భద్రత వంటి అంశాలు చర్చించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2018లో స్వీడిష్ రాజధాని స్టాక్‌హోమ్‌లో మొదటి భారత్-నార్డిక్ సమ్మిట్ జరిగింది.

ఫ్రాన్స్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై మాక్రాన్‌తో చర్చలు..

పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. భారతదేశ రక్షణ అవసరాలలో ఫ్రాన్స్ ఇటీవలి కీలక పాత్ర కారణంగా ఈ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. అలాగే ఈ పర్యటనలో రష్యా గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు మాక్రాన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సహజంగానే రష్యాతో బలమైన సంబంధాలను కలిగి ఉన్న భారతదేశం వైపు కూడా వారు ఎంతో ఆశగా చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Punjab: జూన్ 20 వరకు వరి నాట్లు వాయిదా వేయాలని ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ.. కారణం అదేనా?

Modi vs KCR: ప్రధాని మోదీ వర్సెస్‌ సీఎం కేసీఆర్‌.. ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతుందా..? పెంచుతున్నారా?