PM Narendra Modi: మంచిని కూడా విమర్శిస్తున్నారా..? విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం
PM Modi slams Opposition: ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. మంచిని కూడా విమర్శించడం విపక్షాలకు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
PM Modi slams Opposition: ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. మంచిని కూడా విమర్శించడం విపక్షాలకు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు విపక్షాలు కనిపించడం లేదా అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సమాజాన్ని విభజించి, అధికారాన్ని చేజిక్కించుకుని.. ప్రజలను దోచుకునేందుకు చూస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను ఎంతో కష్టపడి తీసుకువస్తున్నామని గుర్తు చేశారు. అందుకోసం నలుగురు కేంద్ర మంత్రులు కూడా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వేలాది మందిని ఇండియాకు తీసుకువచ్చామన్నారు ప్రధాని మోదీ. భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందించాల్సిందిబోయి విమర్శలకు దిగడం విడ్డూరమంటూ మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారత విద్యార్థిని తీసుకొస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచంలోని అనేక దేశాలు కోవిడ్ మహమ్మారి, అశాంతి, అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయన్నారు మోదీ. ఎలాంటి విపత్తులనైనా తట్టుకునే స్థాయికి భారత్ ఎదిగిందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో చివరి విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించారు. కాషాయం రంగు టోపీ, కండువా ధరించి ఓపెన్ టాప్ వాహనంలో నిల్చొని ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. నగరంలో మూడు కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో కొనసాగింది. ఆ తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో షోడశోపార పూజలు చేశారు ప్రధాని మోదీ.
Also Read: