AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్ వద్దు.. ఆత్మకథలు చదవండి.. జెన్‌జీకి ప్రధాని మోదీ కీలక సందేశం

దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (ఆగస్టు 12, 2026) కీలక సందేశం ఇచ్చారు. ఇది “రీల్స్ యుగం” అని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు యువతను అనేక దిశల్లోకి తీసుకెళ్లగలరని పేర్కొంటూ, జీవితంలో షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవద్దని సూచించారు. విజయాన్ని త్వరగా అందుకోవాలనే ఆలోచన కంటే కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలన్నారు. యువత ఆత్మకథలను చదవాలని పిలుపునిచ్చారు.

రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్ వద్దు.. ఆత్మకథలు చదవండి.. జెన్‌జీకి ప్రధాని మోదీ కీలక సందేశం
Pm Modi Releases Ram Nath Kovind Autobiography
Balaraju Goud
|

Updated on: Aug 12, 2026 | 2:43 PM

Share

దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (ఆగస్టు 12, 2026) కీలక సందేశం ఇచ్చారు. ఇది “రీల్స్ యుగం” అని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు యువతను అనేక దిశల్లోకి తీసుకెళ్లగలరని పేర్కొంటూ, జీవితంలో షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవద్దని సూచించారు. విజయాన్ని త్వరగా అందుకోవాలనే ఆలోచన కంటే కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలన్నారు. యువత ఆత్మకథలను చదవాలని పిలుపునిచ్చారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన “Triumph of the Indian Republic: My Life, My Struggles” ఆత్మకథను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో రామ్‌నాథ్ కోవింద్ బాల్యం నుంచి రాజ్యసభ సభ్యుడిగా, బీహార్ గవర్నర్‌గా, చివరకు భారత 14వ రాష్ట్రపతిగా ఎదిగిన తన ప్రయాణాన్ని వివరించారు. రాష్ట్రపతి భవన్‌లోని తన ఐదేళ్ల అనుభవాలు, కీలక పరిణామాలు, ప్రజా జీవితంలోని అనుభవాలను తన ఆత్మకథ రూపంలో తెలియజేశారు.

షార్ట్‌కట్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుందిః ప్రధాని మోదీ

ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత కాలంలో తక్షణ ఫలితాల కోసం పరుగులు పెట్టవద్దని సూచించారు. రైల్వే స్టేషన్లలో కనిపించే హెచ్చరిక బోర్డులను ఉదాహరణగా తీసుకుంటూ, షార్ట్‌కట్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది అనే భావనను జీవితానికీ వర్తిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడైనా షార్ట్‌కట్ కోసం వెతికే పరిస్థితి వచ్చినప్పుడు ఒక మంచి ఆత్మకథ చదవాలని యువతకు ప్రధాని మోదీ సూచించారు. “నేటి తరం రామ్‌నాథ్ కోవింద్ రచనలు, అనుభవాలను చదవాలి. వాటి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకోవచ్చు” అని ప్రధాని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ భారత ప్రజాస్వామ్యం, సమాజానికి ఒక విలువైన వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

కష్టాల్లోనూ విలువలను వదలని జీవితం

రామ్‌నాథ్ కోవింద్ జీవితంలోని పేదరికం, పరిమిత వనరులు, కష్టాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ, వాటిని ఆయన బలహీనతలుగా మారనివ్వలేదన్నారు. విద్య, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, సేవాభావం వంటి విలువలతో ఆయన అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. రామ్‌నాథ్ కోవింద్ చిన్నతనంలో ఆయన తల్లి అగ్నిప్రమాదంలో మరణించిన విషాద సంఘటనను కూడా మోదీ ప్రస్తావించారు. ఆ కష్ట సమయంలో పొరుగింటి మహిళ కుటుంబానికి అండగా నిలిచిన సంఘటన రామ్‌నాథ్ కోవింద్‌లో సామాజిక ఐక్యత, సామరస్యంపై లోతైన అవగాహన పెంచిందని వివరించారు. ఆయన తండ్రి కుటుంబాన్ని నిలబెట్టి పిల్లలకు విలువలను నేర్పిన తీరు రామ్‌నాథ్ కోవింద్ జీవితంపై ప్రభావం చూపిందని ప్రధాని మోదీ చెప్పారు.

కోవింద్ లాంటి లక్షలాది యువత అవసరంః ప్రధాని

మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులు పేదలు, అణగారిన వర్గాలకు కూడా దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండాలని కలలు కన్నారని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ వంటి వ్యక్తులు తమ కృషి, సామర్థ్యంతో ఆ కలను సాకారం చేసే భారత ప్రజాస్వామ్య ప్రయాణానికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశానికి ఇలాంటి అంకితభావం కలిగిన లక్షలాది యువత అవసరమని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు.

“ఒకే దేశం, ఒకే ఎన్నిక” కోసం కోవింద్ సేవలు

రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రత్యేకంగా “ఒకే దేశం, ఒకే ఎన్నిక” (One Nation, One Election) అంశంపై కోవింద్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ సేవాభావం, అంకితభావం నుంచి దేశ ప్రజలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఆత్మకథ కేవలం వ్యక్తి కథ కాదుః ప్రధాని

రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిజాయితీ, విలువలు, స్వచ్ఛత విషయంలో రాజీ పడకుండా ఎలా ఎదిగారనే అంశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. తన జీవితంలోని కష్టాలు వ్యక్తిగతమైనవైనా, వాటి ఫలితంగా వచ్చిన విజయం మాత్రం భారత గణతంత్రం, ప్రజాస్వామ్య విజయం అని పుస్తక శీర్షికను విశ్లేషిస్తూ మోదీ పేర్కొన్నారు. ఈ పుస్తకం కోవింద్ జీవితంలోని జ్ఞాపకాలను మాత్రమే కాకుండా, భారత ప్రజాస్వామ్య ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను కూడా భవిష్యత్ తరాలకు భద్రపరుస్తుందని ఆయన అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఆత్మకథ వివరాలు: Triumph of the Indian Republic: My Life, My Struggles రచయిత: రామ్ నాథ్ గోవింద్ ప్రచురణకర్త: రూబా పబ్లికేషన్స్ ISBN: 9789353525378.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us