PM Modi : యాస్ తుఫాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటన, ఏరియల్ సర్వే, సమీక్ష
PM Modi to visit Bengal, Odisha : యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు...
PM Modi to visit Bengal, Odisha : యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. తుఫాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల్లో సమీక్ష సమావేశాలను చేపట్టనున్నారని పేర్కొంది. ఏరియల్ సర్వే సైతం చేపడతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా యాస్ తుఫాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలను కుదిపేసింది. దీంతో యాస్ తుఫాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికీ తిండి, ఆవాస ఏర్పాట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నాయి.
ఇలా ఉండగా, తూర్పు తీరంలో విరుచుకుపడిన యాస్ తుఫాను ప్రభావంపై ప్రధానమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ, విద్యుత్, టెలికాం శాఖల కార్యదర్శులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ డీజీ ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.