Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యానికి ఆయనదే బాధ్యత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భటిండా నుంచి ఫిరోజ్ పూర్ కు రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. మార్గ మధ్యలో రైతుల నిరసనలతో ఓ బ్రిడ్జిపై ప్రధానమంత్రి కాన్వాయ్ అరగంట సేపు ఆగిపోయింది. అప్పట్లో ప్రధానమంత్రి..

Narendra Modi: పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యానికి ఆయనదే బాధ్యత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Pm Modi Security Breach
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 25, 2022 | 4:51 PM

Narendra Modi: ఈఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భటిండా నుంచి ఫిరోజ్ పూర్ కు రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. మార్గ మధ్యలో రైతుల నిరసనలతో ఓ బ్రిడ్జిపై ప్రధానమంత్రి కాన్వాయ్ అరగంట సేపు ఆగిపోయింది. అప్పట్లో ప్రధానమంత్రి భద్రత విషయంలో పంజాబ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతోనే రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈఘటనపై సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించి ప్రధానమంత్రి భద్రతా వైఫల్యానికి అసలు కారణాలపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ పూర్తిచేసిన నివేదిక సమర్పించింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆనివేదికను బహిర్గతం చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రతా వైఫల్యానికి సంబంధించి ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ పీ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) నిర్లక్ష్యమే కారణమని ఈనివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ప్రధానమంత్రి భద్రతా వైఫల్యంపై కమిటీ సమర్పించిన నివేదికను చదివి వినిపించింది. భద్రత కల్పించడానికి అవసరమైన సిబ్బంది ఉన్నప్పటికి విధి నిర్వహణలో విఫలం అయ్యారని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన గురించి రెండు గంటల ముందే ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ పీకి సమాచారం ఉన్నా భద్రత పరంగా సరైన చర్యలు చేపట్టలేకపోయారని నివేదికలో పేర్కొన్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈవిషయంలో కేంద్ర భద్రతా బలగాల వైఫల్యం ఎంత మాత్రం లేదని, కేవలం పంజాబ్ పోలీస్ అధికారి వైఫల్యమని తమ విచారణలో స్పష్టంగా తేలిందని నివేదికలో పొందుపర్చినట్లు న్యాయమూర్తులు వెల్లడించారు. ఈనివేదికను కేంద్రప్రభుత్వానికి పంపిస్తామని, అనంతరం సంబంధిత చర్యలు ఉంటాయని భారత సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈఏడాది జనవరి 5వ తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రైతుల నిరసనతో ఫిరోజ్ పూర్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి కాన్వాయ్ ఆగిపోయింది. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతపై యావత్తు దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..