PM Modi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ఆందోళనలో ఉంది.. రాజస్థాన్‌లో ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోదీ..
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని , అంతర్గత కలహాల్లో ఆ పార్టీ నేతలు మునిగిపోయారని విమర్శించారు.

రాజస్థాన్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇవ్వడం .. తరువాత మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ ఉచిత హామీలతో భావితరాలపై పెనుభారం పడుతుందని హెచ్చరించారు. అజ్మీర్‌లో జరిగిన బీజేపీ మెగా ర్యాలీకి మోదీ హాజరయ్యారు. రాజస్థాన్‌లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. ఐదేళ్ల ముందు కాంగ్రెస్‌ను గెలిపిస్తే అంతర్గత కలహాలతో ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారని మండిపడ్డారు. సీఎం, ఎమ్మెల్యేల అవినీతితో రాజస్థాన్ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
బుధవారం (మే 31) కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరించినందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్రంగా దాడి చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆదివారం భారత్‌కు కొత్త పార్లమెంటు భవనం వచ్చింది. అయితే కాంగ్రెస్ తన స్వార్థపూరిత వ్యతిరేకత కోసం భారతదేశం గర్వించే ఈ క్షణాన్ని త్యాగం చేసింది.
కాంగ్రెస్ తన స్వార్థం కోసం కొత్త పార్లమెంటును వ్యతిరేకించిందని.. తద్వారా ప్రపంచం మొత్తం దేశం పరువు తీయవచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్ అని అన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక సమస్య పేద కుటుంబంలోని కొడుకు దేశాన్ని ఇంత దూరం ఎలా తీసుకెళ్తున్నాడన్నది. కాంగ్రెస్, వారితో పాటు ఇతర పార్టీలు 60,000 మంది కార్మికుల శ్రమను, దేశ మనోభావాలను, ఆకాంక్షలను అవమానించాయన్నారు.
ప్రధాని మోదీ ఇంకా ఏం అన్నారంటే..
అవినీతి, కుటుంబ పాలనను ఓ పేదవాడి కొడుకు ఎలా ప్రశ్నిస్తాడని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ సరిహద్దుల్లో రోడ్లు నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని అన్నారు. కానీ భారతదేశ సరిహద్దులను రోడ్డు కనెక్టివిటీతో అనుసంధానించే పనిని తమ ప్రభుత్వం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం అని ఎద్దేవ చేశారు.. ఈ రిమోట్ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద.. అంటే ఢిల్లీ నాయకుల వద్ద ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.
పుష్కర్‌లో బ్రహ్మ దేవాలయాన్నిసందర్శించిన మోదీ
అంతకుముందు పుష్కర్‌లో బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించారు మోదీ. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ మోదీని ఘనంగా సత్కరించింది. 9 ఏళ్ల పాలనపై ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ 51 మెగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. తొలి ర్యాలీని అజ్మీర్‌లో ప్రారంభించారు. రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం