PM Modi: సముద్రశక్తిగా భారత్ – మేరిటైమ్ రంగంలో మోదీ విజన్
ఒకప్పుడు పాత చట్టాలతో అచేతనంగా ఉన్న సముద్రరంగం, నేడు భారత అభివృద్ధికి కొత్త అలగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చోళులు, మరాఠాల నౌకాదళ వారసత్వం నుంచి ఆధునిక పోర్టుల దాకా భారత పయనం ఎలా మారిందో వివరించారు. పోర్టుల సామర్థ్యం, కార్గో హ్యాండ్లింగ్, సీ ఫేరర్ల సంఖ్య, నదీ రవాణా రంగాల్లో భారత్ కొత్త శక్తిగా అవతరించిందన్నారు.

“ముంబై అంటే సముద్రానికి చిహ్నం.. చరిత్రగా చూస్తే శివాజీ మహారాజ్ నౌకాదళం నుంచి మొదలైన ఈ నగరం, నేడు భారత వాణిజ్యానికి, పోర్ట్ అభివృద్ధికి హబ్‌గా మారింది” అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ముంబైలో జరుగుతున్న ఇండియా మేరిటైమ్ వీక్–2025 లో భాగంగా జరిగిన మేరిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, సముద్రరంగ భవిష్యత్తు, పోర్ట్ ఆధారిత అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశం సముద్ర వారసత్వాన్ని తిరిగి చైతన్యం చేసుకుంటోంది. మత్స్యకారుడు నుంచి నౌకానిర్మాణం వరకు… ప్రతీ దశలో మార్పు కనిపిస్తోంది” అని చెప్పారు.
సముద్ర వారసత్వం నుంచి ఆధునికత దాకా మోదీ మాట్లాడుతూ “చోళులు, మరాఠాలు సముద్రాధిపత్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. కానీ దశాబ్దం క్రితం భారత్ సముద్రరంగం పాత చట్టాలు, పరిమిత సామర్థ్యాల కింద నడిచేది. అది మనకు అంగీకారమేమీ కాదు. అందుకే మేము సంస్కరణల దిశగా అడుగులు వేశాం,” అని పేర్కొన్నారు.

PM Modi
మారిన చిత్రం.. మాటల్లోనే కాదు, గణాంకాల్లోనూ…
పోర్ట్ సామర్థ్యం: 1,400 నుంచి 2,762 ఎంఎంటీపీఏ (MMTPA) కి పెరిగింది.
కార్గో హ్యాండ్లింగ్: 972 నుంచి 1,594 ఎంఎంఎట్ (MMT).
వెసెల్ టర్న్‌అరౌండ్ టైమ్: 93 గంటల నుంచి 48 గంటలకు తగ్గింది.
నికర లాభం: రూ. 1,026 కోట్ల నుంచి రూ. 9,352 కోట్లకు పెరిగింది.
ఆపరేటింగ్ రేషియో: 73% నుంచి 43%కి పడిపోయి సమర్థత పెరిగింది.
“ఇది నంబర్ల మార్పు కాదు, మన ఆలోచనా విధానం మార్పు” అని ప్రధాని అన్నారు. ‘భారత సీ ఫేరర్ల సంఖ్య 1.25 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగింది. ఇప్పుడు ప్రపంచ సీ ఫేరర్లలో 12% భారతీయులే. మన యువతే ఈ రంగానికి ప్రాణం పోసింది” అని మోదీ తెలిపారు.
తీరాలనుంచి నదుల దాకా విస్తరించిన నౌకాయానం
ఇండియన్ ఫ్లాగ్ వెసెల్స్: 1,205 → 1,549
ఫ్లీట్ గ్రాస్ టన్నేజ్: 10 ఎంజిటి → 13.52 ఎంజిటి
కోస్టల్ షిప్పింగ్ కార్గో: 87 ఎంఎంఎట్ → 165 ఎంఎంఎట్
ఇన్‌లాండ్ వాటర్‌వే కార్గో: 18 ఎంఎంఎట్ → 146 ఎంఎంఎట్ (710% పెరుగుదల)
ఆపరేషనల్ వాటర్‌వేస్: 3 → 32
ఫెర్రీ, రో-పాక్స్ సర్వీసులు: 2024–25లో 7.5 కోట్లు ప్రయాణికులు
పచ్చపోర్టులు, కొత్త భవిష్యత్తు
విజిన్జం పోర్ట్ – దేశంలో తొలి డీప్ వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్.
కాండ్లా పోర్ట్ – భారత్ తొలి గ్రీన్ హైడ్రజన్ ఫెసిలిటీ.
జేఎన్‌పీటీ – రెండింతల సామర్థ్యంతో, అత్యధిక విదేశీ పెట్టుబడిని ఆకర్షించింది.
వధవన్ పోర్ట్ (మహారాష్ట్ర) – రూ. 76,000 కోట్ల పెట్టుబడి, 20 మీటర్ల లోతుతో ప్రపంచ డీప్ డ్రాఫ్ట్ పోర్టుల సరసన. డెల్హీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, వెస్టర్న్ ఫ్రైట్ కారిడార్ సమీపం వల్ల ఈ ప్రాంతం లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్, వాణిజ్య రంగాలకు కేంద్రంగా మారనుంది.
రిఫార్మ్ నుంచి ట్రాన్స్‌ఫార్మ్ దాకా
ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన ఐదు కీలక బిల్లులు.. బిల్ ఆఫ్ లేడింగ్ బిల్, ఇండియన్ పోర్ట్స్ బిల్ (2025) వంటివి.. సముద్రరంగ నాగరీకతకు కొత్త బాటలు వేశాయి. ప్రభుత్వం రూ. 70,000 కోట్ల అంబ్రెల్లా ప్యాకేజీను ఆమోదించింది. షిప్‌బిల్డింగ్ అసిస్టెన్స్ స్కీమ్, మేరిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్, షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా రూ. 4.5 లక్షల కోట్లు పెట్టుబడి ఆకర్షించి, 2,500 కంటే ఎక్కువ నౌకలు తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
“భారత్ వద్ద పొడవైన తీరరేఖ ఉంది, ప్రపంచ వాణిజ్య మార్గాలపై వ్యూహాత్మక స్థానం ఉంది, ఆధునిక పోర్టులు ఉన్నాయి, బ్లూ ఎకానమీని పెంచే స్పష్టమైన దృష్టి ఉంది. మన యువత శక్తి, సాంకేతికత, మౌలిక సదుపాయాలే మన బలం” అని ప్రధాని పేర్కొన్నారు.




