Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివస్తున్న పెట్రోల్ ధరలు.. కేంద్ర వ్యూహం ఇదే..
పెట్రో బాదుడుకు కళ్లెం పడుతుందా ? పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగొచ్చే అవకాశం ఉందా ? దీనికి కేంద్ర ప్రభుత్వం అవుననే సమాధానం చెబుతోంది.
పెట్రో బాదుడుకు కళ్లెం పడుతుందా ? పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగొచ్చే అవకాశం ఉందా ? దీనికి కేంద్ర ప్రభుత్వం అవుననే సమాధానం చెబుతోంది. వాహనదారులకు పెట్రోబంక్ చూస్తేనే ఎక్కడ లేని నీరసం ఆవహిస్తోంది. బండి తీయాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, ఇంకా కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదు. దీంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధరలు ఇంకా వంద రూపాయలపైనే ఉన్నాయి. అయితే తాజాగా వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.
అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు ఇప్పటికే అమెరికా, జపాన్ సహా పెద్ద దేశాలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటోంది. కొవిడ్ తర్వాత ఇప్పటికే సామాన్యుల జీవితాలు తల్లకిందులు కాగా, పెరుగుతున్న ధరలు జనాల నడ్డి విరుస్తున్నాయి. దీంతో పెట్రో ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం.
తాజాగా పెట్రో ధరలను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో మూడు ప్రాంతాల్లో భారత్‌కు వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తున్నారు. వీటి నుంచి వచ్చే 7-10 రోజుల్లో చమురును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం.
ఈ చమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్‌కు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు అనుసంధానమై ఉన్నాయి. దీని తర్వాత కూడా మరింత చమురును కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..!