Pegasus: “పెగాసస్” విచారణకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ.. త్వరలో ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌పై.. విచారణకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది సుప్రీం కోర్టు. ఇందుకు సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
Pegasus snooping row: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌పై.. విచారణకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది సుప్రీం కోర్టు. ఇందుకు సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. సీనియర్ న్యాయవాదితో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. పెగాసస్‌పై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని..వచ్చేవారం నాటికి కమిటీ సభ్యులను ఖరారు చేస్తామని తెలిపారు.
10 రోజుల క్రితం పెగాసస్‌పై స్వతంత్ర దర్యప్తు జరపాలన్న పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని..ఐతే మరో అఫిడవిట్ దాఖలు చేయలేమని కోర్టుకు విన్నవించారు ఎస్జీ. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. తాజాగా పెగాసస్‌పై విచారణకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్ట వెల్లడించారు.
పెగాసస్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో ఒకరైన చందర్ సింగ్‌తో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ ఈ విషయాన్ని తెలిపారు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే, సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్ జస్టిస్ వెల్లడించారు. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపి.. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్‌వేర్ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
Read Also…. Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ముగిసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ.. విస్తుగొలిపే సంగతులు.!