AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session: శీతకాల సమావేశాలు అరంభంతో విపక్షాల ఆందోళన.. హుందాతనాన్ని నిలబెట్టాలన్న ప్రధాని

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే లోక్‌సభ.. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వెంటనే మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Parliament Winter Session: శీతకాల సమావేశాలు అరంభంతో విపక్షాల ఆందోళన.. హుందాతనాన్ని నిలబెట్టాలన్న ప్రధాని
Pm Modi
Balaraju Goud
|

Updated on: Nov 29, 2021 | 11:57 AM

Share

Parliament Winter Session 1st Day: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే లోక్‌సభ.. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వెంటనే మధ్యాహ్నానికి వాయిదా పడింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు.. ఈరోజే లోక్‌సభకు రానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సర్కార్‌పై సమరానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రైతు సమస్యలను చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా, ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇటీవల కొందరు సభ్యుల మృతి పట్ల సంతాపం తెలియజేసే తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చదివారు. అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ గంట సేపు వాయిదా పడింది.

అయితే, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పెగాసస్‌, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సమావేశాలను కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు వీటిని లేవనెత్తి తమ వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్థవంతమైన చర్చల ద్వారా పార్లమెంటు హుందాతనాన్ని నిలబెట్టాలని పార్లమెంటు సభ్యులను ప్రధాని కోరారు. ఈ సమావేశాల్లో సకారాత్మక కృషి జరగడం ముఖ్యమని చెప్పారు. పార్లమెంటులో చర్చించాలని, సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని చెప్పారు. వాయిదాలు, అంతరాయాలు కాకుండా అర్థవంతమైన చర్చ జరిగిందని ఈ సమావేశాలు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కరోనా కొత్త వేరియంట్‌ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం ప్రధాని కేబినెట్‌ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు.. ఈరోజే లోక్‌సభకు రానున్నట్లు సమాచారం. సోమవారం తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలంటూ అధికార బీజేపీ , ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీచేసిన విషయం తెలిసిందే.