AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు.. ఎన్డీఏ మాస్టర్ ప్లాన్..! ఇవాళ్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు..

ఈరోజు ప్రారంభమవుతున్న పార్లమెంట్ మాన్సూన్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నాయి. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు, జమిలి ఎన్నికలు, ఉన్నత విద్యా సంస్కరణలు వంటి కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని చూస్తుండగా, ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలు, నీట్ పరీక్ష, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష కూటమి వ్యూహాలు రచిస్తోంది.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు.. ఎన్డీఏ మాస్టర్ ప్లాన్..! ఇవాళ్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు..
Parliament Monsoon Session
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2026 | 7:44 AM

Share

దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అలుముకున్నా… మరికాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల కుంభవృష్టి కురిసే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో తొలిసారి అధికారం చేపట్టడంతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ను బలహీనపరచడం ద్వారా పార్లమెంట్‌లో ప్రతిపక్ష కూటమిని దెబ్బకొట్టాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలుగా తాము భావిస్తున్న వాటిని ఆయుధాలుగా మార్చుకుని కేంద్రాన్ని ఇరుకునపెట్టాలని విపక్షం వ్యూహరచన చేస్తోంది. దీంతో మాన్‌సూన్ సెషన్ మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ అజెండాలో పాత పెండింగ్‌ బిల్లులు యథాతథంగా ఉన్నాయి. కొత్తగా అయిదు బిల్లులు వచ్చి చేరాయి. అందులో వరసగా 30 రోజులపాటు జైలుకెళ్లిన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల ఉద్వాసనకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు, ఉన్నత విద్యారంగ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బాగా వివాదాస్పదమయ్యాయి. వీటిలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఎలాగైనా పాస్‌ చేయించుకోవాలని అధికారపక్షం ప్రయత్నిస్తోంది. అయితే, కాంగ్రెస్‌తోపాటు కొన్ని కూటమిలోని పార్టీలు మాత్రం ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలనుకుంటున్నాయి.

డీలిమిటేషన్‌ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు పద్దతు పలికేలా అధికారపక్షం తెరవెనుక మంత్రాంగాన్నీ నడుపుతోంది. దాని ఫలితంగానే విపక్షాల స్వరంలో మార్పు కనిపిస్తోంది. 50 శాతం సీట్లు పెంచుతామని బిల్లులో నిబంధన పెడితే మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని శరద్‌పవార్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దక్షిణభారతంలో పెద్ద పార్టీ అయిన డీఎంకే కూడా ఈ విషయంలో తన ధోరణిని మార్చుకునేలా కనిపిస్తోంది. తమిళనాడులో టీవీకే సర్కారుకు కాంగ్రెస్‌ వెన్నుదన్నుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని డీఎంకే… ఇండియా కూటమి నుంచి బయటికొచ్చి పార్లమెంట్‌లో ప్రత్యేక సీట్ల కోసం స్పీకర్‌కు లేఖ రాసింది. ఈ క్రమంలో డీఎంకే కూడా NDAకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతునిస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇండీ కూటమి అస్త్రాలు

ఇటు అధికారపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు ఇండీ కూటమి కూడా అస్త్రాలు సిద్ధం చేసుకుంది. అయోధ్యలో విరాళాల చోరీ, నీట్‌ పేపర్‌ లీక్, క్రూడాయిల్ క్రైసిస్, ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితులను దాటిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, SIR వంటి అంశాలను ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లో అధికారపక్షానికి ఊపిరి ఆడకుండా చేయాలని ఇండీ కూటమి భావిస్తోంది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేయనుంది. అలాగే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలాంటి చోట్ల వెలుగుచూస్తున్న అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, అణచివేతలను జాతీయస్థాయిలో ఎండగట్టి బీజేపీ దూకుడును అడ్డుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నుతోంది. ఇందుకోసం ఈనెల 16న ఆ పార్టీ సీనియర్‌ నాయకులంతా కలిసి ఓ దఫా మేధోమథనం కూడా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన ఎంపీలను చీల్చి వారిని అధికార కూటమిలోనో, ఇంకో పార్టీలోనో చేరేలా చేసి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు తూట్లుపొడుస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్‌ సాక్షిగా లేవనెత్తే అవకాశముంది. అలాగే… చలో పార్లమెంట్‌కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడమూ కాక రేపుతోంది. అంతేకాదు… కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీని విపక్షాలు వాకౌట్ చేశాయి. సో… ఈసారి సభ దద్దరిల్లేలా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us