‘నువ్వు చనిపోయావ్..’ బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్.. అవాక్కైన మహిళ!
మదురైకి చెందిన ఓ మహిళకు ఊహించని షాక్ ఎదురైంది. తాను ప్రాణాలతో ఉండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ జారీ అయినట్లు పోలీసుల ద్వారా తెలుసుకుంది. తన కుమారుడు పెరుమాళ్ ఆరు నెలల క్రితం మృతి చెందాడని ఆమె చెప్పగా, అతని భార్య మాత్రం ఆస్తి, బంగారు నగల కోసం..

మదురై, ఆగస్ట్ 19: ఓ మహిళకు ఊహించని షాక్ ఎదురైంది. తాను ప్రాణాలతో ఉండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణపత్రం జారీ కావడంతో ఆమె విస్తుపోయింది. అంతేకాకుండా తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చినంత పని అయింది. ఈ విచిత్ర ఘటన మదురైలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని మదురైకి చెందిన పెరుమాళ్ అనే వ్యక్తి భార్య సుందరి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అత్త చనిపోయిందని, ఆమె పేరిట భూమి, బంగారు నగలు ఉన్నాయని, వాటిని తనకు ఇప్పించాలని కోరింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు పెరుమాళ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ మహిళను చూసి ‘పెరుమాళ్ ఎవరు?’ అని ప్రశ్నించారు. అందుకు ఆమె.. పెరుమాళ్ తన కుమారుడేనని సమాధానం ఇచ్చింది. అనంతరం పోలీసులు అసలు విషయం చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పెరుమాళ్ తల్లి చనిపోయిందని, ఆమె పేరిట ఉన్న భూమి, బంగారు నగల విషయమై ఆయన భార్య ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ తాను ప్రాణాలతోనే ఉన్నానని, తన కుమారుడు పెరుమాళ్ ఆరు నెలల క్రితం మృతి చెందాడని చెప్పింది.
దీంతో పోలీసులు ఆమె పేరుతో ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించారు. తాను బతికుండగానే తనకు డెత్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో తెలియక ఆమె అవాక్కైంది. ఈ వ్యవహారంపై ఆరా తీయగా.. ఆమె కోడలు సుందరి నకిలీ మరణ ధ్రువీకరణపత్రం సృష్టించినట్లు తెలిసింది. ఈ ఘటనపై వివరణ కోరేందుకు పెరుమాళ్ తల్లి వీఏవో కార్యాలయానికి వెళ్లింది. తాను ప్రాణాలతో ఉండగా తన పేరుతో మరణ ధ్రువీకరణపత్రం ఎలా జారీ చేశారని ప్రశ్నించింది. అయితే తగిన ఆధారాలతోనే ధ్రువీకరణపత్రం జారీ చేసినట్లు వీఏవో చెప్పడంతో ఆమె మరింత ఆశ్చర్యానికి గురైంది. చివరకు ఈ వ్యవహారంపై సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. ఆస్తి కోసం కోడలు నకిలీ పత్రాలు సృష్టించిందన్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




