సుప్రీంకోర్టులో ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ కి చుక్కెదురు, విచారణకు ‘నో’ చెప్పిన కోర్టు
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు చేపట్టేందుకు కోర్టు...
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. ఆయన హైకోర్టుకే వెళ్లాలని సూచించడంతో సింగ్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సీబీఐ విచారణ చేయించేలా ఆదేశించాలని , తనను హోమ్ గార్డ్స్ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా సవాల్ చేస్తూ పరమ్ బీర్ సింగ్ అత్యున్నత న్యాయస్థానానికెక్కారు. పిటీషనర్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, కానీ దీనిపై సుప్రీంకోర్టు బదులు హైకోర్టే విచారణ చేయాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఆర్.సుభాష్ రెడ్డిలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. 32 వ అధికరణం కింద అత్యున్నత న్యాయస్థానంలో బదులు.. 226 ఆర్టికల్ కింద హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తీవ్ర ఆరోపణలు చేసినా..ఆయననుప్రతివాదిగా పిటిషనర్ ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
పరమ్ బీర్ సింగ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి, తమ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తూ తాము ఈ రోజే దీన్ని హైకోర్టులో దాఖలు చేస్తామని తెలిపారు. కాగా- తనను మరో విభాగానికి చేసిన బదిలీపై స్టే జారీ చేయాలని కూడా పరమ్ బీర్ సింగ్ తన పిటిషన్ లో అభ్యర్థించారు. తన ట్రాన్స్ ఫర్ రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ ని అతిక్రమించేదిగా ఉందని ఆయన అన్నారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ప్రతి నెలా 100 కోట్లను వసూలు చేయాల్సిందిగా మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని సింగ్..ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖలో ఆరోపించారు. ఈ లేఖ మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టించింది.
మరిన్ని చదవండి ఇక్కడ :‘నాకు తెలుసు సుశాంత్ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ పోస్ట్ : Naveen Polishetty video.