Target 2024: ప్రతిపక్షాల తీరు ఎవరికి వారే యమునా తీరే.. 2024లో మోదీని ఢీకొట్టే వ్యూహం లేని విపక్షాలు..
అందరి టార్గెట్ ప్రధాని మోదీనే.. 2024లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యమంటారు.. కాని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. విపక్షాల అనైక్యతే బీజేపీ బలం.. విడివిడిగా పోటీ చేస్తే మరోసారి కమలం పార్టీ విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

విపక్షాల అనైక్యతే బీజేపీకి వరంగా మారింది. ప్రతిపక్షాలు చీలిపోవడంతో .. కేంద్రలో బీజేపీ మరోసారి అధికారం రావడం ఖాయమన్న అంచనాకు వస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. విపక్షాల్లో ఓ క్యాంప్ కాంగ్రెస్‌కు అనుకూలంగా .. మరో క్యాంప్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దీంతో ఓట్లు చీలి బీజేపీకి వరంగా మారుతుందని అంటున్నారు. మనీష్ సిసోడియా అరెస్ట్‌పై కాంగ్రెస్ మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ లేఖ రాశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ , తమిళనాడు సీఎం స్టాలిన్ , ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ , బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ , ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఈ లేఖపై సంతకాలు చేశారు. కాని కాంగ్రెస్ మాత్రం లేఖపై సంతకం చేయలేదు.
ప్రతిపక్షాల ఐక్యత కోసం కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా.. మమత బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి లీడర్లు ముందుకు రావడం లేదు. తామే నేతృత్వం వహించాలనే ఆశతో.. ప్రతిపక్షాలు నిర్వహించే సదస్సులు, సమావేశాలకు హాజరుకావడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలు కలిస్తే దాదాపు 180 సీట్లను కాపాడుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిపై క్లారిటీ లేదు
ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిపై కూడా క్లారిటీ లేదు. రాహుల్‌గాంధీని విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా చాలా రాజకీయ పార్టీలు ఒప్పుకోవడం లేదు.. కొంతమంది నితీష్‌ను పేరును ప్రస్తావిస్తుంటే మరికొంతమంది మమత అయితే బాగుంటుందని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకల సందర్భంగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ దేశ ప్రధాని అయితే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలోనే ఫరూఖ్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యత ముఖ్యమని , ప్రధాని పదవి గురించి తరువాత ఆలోచిద్దామని ఆ వ్యవహారాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేశారు ఖర్గే.
అందరి టార్గెట్..
అందరి టార్గెట్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే … కాని బలమైన ప్రత్యర్ధిని గద్దెదించడానికి విపక్షాల దగ్గర ఉమ్మడి కార్యాచరణ లేదు. ఒకరిపై ఒకరికి అపనమ్మకం .. దీంతో 2024లో మోదీని ఢీకొట్టే నేత ఎవరు కూడా కన్పించడం లేదు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బాగా పుంజుకున్న విషయం వాస్తవం. జాతీయ స్థాయిలో
ఇక రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, బీజేడీ పార్టీల్లో ఒక్క బీఆర్ఎస్ తప్ప బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కనపడటం లేదు. కాంగ్రెసేతర పార్టీలతో అలయన్స్ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. కానీ ఒడిషాలోని బీజేడీ, ఏపీలోని వైసీపీ మాత్రం ఆ పొత్తులోకి రావడం లేదు. అవసరం అయితే ఆయా పార్టీలు బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
తమిళనాడులో డీఎంకే -కాంగ్రెస్ పొత్తు
తమిళనాడులోని డీఎంకే మాత్రం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. దక్షిణాదిలో బలంగా ఉన్న పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం సులభమే. కానీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీలోని 80 సీట్లు, బెంగాల్‌లోని 42, ఏపీలోని 25, ఒడిషాలోని 21, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని అంచనా వేస్తున్నారు. ఆయా స్థానాల్లో అక్కడ బలంగా ఉన్న అధికార పార్టీలే ఒంటరిగా పోటీ చేస్తాయి. మరి ఇలాంటి సమయంలో మిగిలిన స్థానాల్లో ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై ప్రతిపక్షాల్లో స్పష్టత రావడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పొత్తుపై స్పష్టత వచ్చి.. విపక్షాలు ఐక్యంగా ఉంటేనే బీజేపీని ఎదుర్కోవడం సులభం అవుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం




