AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OBC Bill in Parliament: పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు..ఈ బిల్లు ఎందుకు? దీనితో ప్రయోజనం ఏమిటి? 

రిజర్వేషన్ల కోసం ఓబిసి జాబితాను సిద్ధం చేసే హక్కును రాష్ట్రాలకు ఇచ్చే బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించింది.

OBC Bill in Parliament: పార్లమెంట్‌లో ఓబీసీ బిల్లు..ఈ బిల్లు ఎందుకు? దీనితో ప్రయోజనం ఏమిటి? 
Obc Bill In Parliament
KVD Varma
|

Updated on: Aug 10, 2021 | 3:00 PM

Share

OBC Bill in Parliament: రిజర్వేషన్ల కోసం ఓబిసి జాబితాను సిద్ధం చేసే హక్కును రాష్ట్రాలకు ఇచ్చే బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించింది. దీనితో, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి అవసరాలకు అనుగుణంగా ఓబీసీ (OBC) ల జాబితాను సిద్ధం చేయగలవు. సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ 127 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గత నెలలోనే, వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ప్రభుత్వం దీనిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అసలు ఈ రాజ్యాంగ సవరణ అవసరం ఏమిటి?  ఓబీసీ రిజర్వేషన్ 50% పరిమితిని తొలగించాలని ప్రతిపక్ష నాయకులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? తెలుసుకుందాం.

ఈ మార్పు అవసరం ఏమిటి?

ఈ ఏడాది మే 5 న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడానికి, సామాజికంగా – విద్యాపరంగా వెనుకబడిన వ్యక్తులకు ప్రవేశం కల్పించే హక్కు రాష్ట్రాలకు లేదని ఈ క్రమంలో కోర్టు చెప్పింది.  దీని కోసం, న్యాయమూర్తులు రాజ్యాంగంలోని 102 వ సవరణను ప్రస్తావించారు. అదే నిర్ణయంలో, మహారాష్ట్రలోని మరాఠాలను ఓబిసిలో చేర్చడం ద్వారా రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయాన్ని కూడా సుప్రీం కోర్టు నిలిపివేసింది.

వాస్తవానికి, 2018 లో ఈ 102 వ రాజ్యాంగ సవరణలో, వెనుకబడిన తరగతుల కోసం జాతీయ కమిషన్  అధికారాలు..బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో పాటు, ఈ 342A వెనుకబడిన కులాల జాబితాను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. ఈ సవరణ తరువాత, విపక్షాలు కేంద్రం సమాఖ్య నిర్మాణానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపించాయి. మే 5 న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కేంద్రం కూడా వ్యతిరేకించింది. దీని తరువాత, 2018 రాజ్యాంగ సవరణలో మార్పు కసరత్తు ప్రారంభమైంది.

కొత్త బిల్లులో ఏముంది?

రాజ్యాంగంలోని 102 వ సవరణలోని కొన్ని నిబంధనలను స్పష్టం చేయడానికి ఈ బిల్లు తీసుకురాబడింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, రాష్ట్రాలకు మరోసారి వెనుకబడిన కులాలను జాబితా చేసే హక్కు లభిస్తుంది. ఏదేమైనా, 1993 నుండి, కేంద్రం, రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ఓబీసీల ప్రత్యేక జాబితాలను తయారు చేస్తున్నాయి. అయితే, 2018 రాజ్యాంగ సవరణ తర్వాత ఇది జరగలేదు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, పాత విధానం మళ్లీ అమలు చేస్తారు.  దీని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A సవరణ జరుగుతోంది.  దీనితో పాటు, ఆర్టికల్ 338B మరియు 366 లో సవరణలు కూడా చేశారు.

బిల్లు ఆమోదం పొందితే వచ్చే మార్పేమిటి?

ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం ప్రకారం వివిధ కులాలను ఓబీసీ (OBC) కోటాలో చేర్చగలుగుతాయి. ఇది హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లోని గుజ్జర్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కులాలు చాలా కాలంగా రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇందిరా సాహ్నీ కేసును ఉదహరిస్తూ సుప్రీం కోర్టు వారి డిమాండ్లపై స్టే విధించింది.

ఈ బిల్లు ఆమోదం పొందితే, కొత్త కులాలను ఓబీసీలో చేర్చడానికి రాష్ట్రాలకు అధికారం లభిస్తుంది. అయితే రిజర్వేషన్ పరిమితి ఇప్పటికీ 50%గానే ఉంటుంది. ఇందిరా సాహ్నీ కేసు నిర్ణయం ప్రకారం, ఎవరైనా 50%పరిమితికి మించి రిజర్వేషన్ ఇస్తే, సుప్రీం కోర్టు దానిని నిషేధించవచ్చు. ఈ కారణంగా అనేక రాష్ట్రాలు ఈ పరిమితిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇందిరా సాహ్నీ కేసు ఏమిటి?

పివి నరసింహారావు ప్రభుత్వం 1991 లో, ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీకి 10% రిజర్వేషన్ కల్పించింది. జర్నలిస్ట్ ఇందిరా సాహ్నీ రావు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. సాహ్ని కేసులో, రిజర్వేషన్ కోటా 50%మించరాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం తరువాత, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరగదని ఒక చట్టం రూపొందించారు.

ఈ కారణంగా, రాజస్థాన్‌లో గుర్జర్లు, హర్యానాలో జాట్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు రిజర్వేషన్ కోసం అడిగినప్పుడు, సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీని తరువాత కూడా, అనేక రాష్ట్రాలు ఈ నిర్ణయం నుండి బయటపడ్డాయి. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, హర్యానా, బీహార్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో మొత్తం రిజర్వేషన్ 50%కంటే ఎక్కువ.

దీని వెనుక ఉన్న రాజకీయం ఏమిటి?

విపక్షాలు చాలా కాలంగా కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత, హర్యానా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలోని బీజేపీ  ప్రభుత్వాలు జాట్, పటేల్, లింగాయత్ కులాలను ఓబిసిలో చేర్చడం ద్వారా ఎన్నికల ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తాయి.

హర్యానాలో జాట్‌లు లేదా గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లు లేదా మహారాష్ట్రలోని మరాఠాలు ఎవరైనా సరే తమ తమ రాష్ట్రాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ కులాల ఓటు బ్యాంకును పొందటానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వాటిలో రిజర్వేషన్ కూడా ఒకటి.

Also Read: Gas Subsidies: కేంద్ర సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్లపై అందించిన గ్యాస్ సబ్సిడీ ఎంతో తెలుసా..?

Silver Coins: సింధు నది ఒడ్డుకు కొట్టుకొస్తున్న 280 ఏళ్ల నాటి వెండి నాణేలు.. ఏరుకోవడానికి ఎగబడుతున్న జనం