Rajyasabha: రాజ్యసభ రగడపై సీసీ ఫుటేజ్ విడుదల చేసిన కేంద్రం.. విపక్షాల ఆరోపణలు అవాస్తవమంటూ..?

దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్‌పై పార్లమెంట్‌ అట్టుడికిపోయింది. జులై 19 నుంచి నిన్నటివరకు పెగాసస్‌పై పార్లమెంట్‌లో చర్చించాలంటూ పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు.

Rajyasabha: రాజ్యసభ రగడపై సీసీ ఫుటేజ్ విడుదల చేసిన కేంద్రం.. విపక్షాల ఆరోపణలు అవాస్తవమంటూ..?
Opposition Ruckus In Rajya Sabha
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 12, 2021 | 4:05 PM

 Opposition MPs Ruckus in Rajya Sabha: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్‌పై పార్లమెంట్‌ అట్టుడికిపోయింది. జులై 19 నుంచి నిన్నటివరకు పెగాసస్‌పై పార్లమెంట్‌లో చర్చించాలంటూ పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు. దీంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. వాయిదాల పర్వం నడిచి రెండ్రోజులు ముందుగానే అర్థంతరంగా పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయితే, అధికార పక్షం ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకుందంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడును కలిసి ఫిర్యాదు చేశారు విపక్ష సభ్యులు. ప్రతిపక్షానికి కౌంటర్‌గా మొన్న సభలో జరిగిన గొడవకు సంబంధించిన ఫుటేజీని విడుదల చేసింది కేంద్రం.

రెండ్రోజుల క్రితం రాజ్యసభలో పెనుదుమారమే చెలరేగింది. పెగాసస్‌ నిఘా, కొత్త వ్యవసయసాగు చట్టాలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులు.. చైర్‌ పైకి ఫైళ్లు , రూల్స్‌ బుక్‌ను విసిరారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌సింగ్‌ బజ్వా.. టేబుల్‌ ఎక్కి చైర్‌ పైకి రూల్‌ బుక్‌ను విసరడం సంచలనం రేపింది. తాజాగా రాజ్యసభలో ఆ రోజు జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను ఇప్పుడు బయటపెట్టింది కేంద్రం.

ఇదిలావుంటే, బయటి వ్యక్తులకు మార్షల్స్ డ్రస్‌లు వేసి బుధవారం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి నిరసన తెలుపుతూ గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంట్‌ దగ్గర నుంచి విజయ్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్‌లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్‌ లోపలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్‌ తమపై మ్యాన్‌హ్యాండిలింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలు రాజ్యసభ చైర్మన్ కన్నీళ్ల గురించి మాట్లాడుతున్నారని, సభ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత చైర్మన్‌దేనన్న విషయం గుర్తించాలని రాహుల్ చెప్పారు. పార్లమెంటులో తమ గళాన్ని ప్రభుత్వం నొక్కేసిందని, దీంతో ఇవాళ తమ వాయిస్ వినిపించేందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు.

ఎంపీలే మార్షల్స్‌పై దాడి చేశారు మరోవైపు, ప్రతిపక్ష నేతల ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. మార్షల్స్‌పైనే కొన్ని పార్టీల ఎంపీలు దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, సభ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఈ విషయం తేలిపోతుందని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. Read Also… Parliament Storm: రాజ్యసభలో మార్షల్స్ పై విపక్షాల దాడి.. లైవ్ వీడియో