పూర్తిగా తగ్గుముఖం పట్టినా కరోనా మహమ్మారి.. 15 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు: కేంద్ర ఆరోగ్యశాఖ
గత ఏడాదిగా తీవ్రంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తగ్గుతుండటంతో ఉపశమనాన్ని కలిగించే విషయమని...
గత ఏడాదిగా తీవ్రంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తగ్గుతుండటంతో ఉపశమనాన్ని కలిగించే విషయమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా చోటు చేసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిందని, అలాగే గడిచిన ఒక రోజు వ్యవధిలో ఒక్క మరణం కూడా సంభవించలేదన్నారు. రోజువారీ మరణాలు సగటున దాదాపు 55 శాతం తగ్గిందన్నారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశ జనాభాలో 70 శాతం ప్రజలకు హానీ ఉందని సెరో సర్వే చెబుతోందన్నారు. అందుకే కొంత కాలంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా, గడిచిన 24 గంటల్లో దాదాపు 9వేల కేసులు నమోదు కాగా, 1.43 లక్షల కేసులు యాక్టివ్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా దేశ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 63 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకా ప్రక్రియ 65 శాతానికి పైగా పూర్తయిందని, మరో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 40 శాతానికి తక్కువ మాత్రమే ఆరోగ్య సిబ్బందికి టీకా పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ