Super Star Rajinikanth: శశికళకు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎందుకంటే..
Super Star Rajinikanth: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమె యోగ క్షేమాలపై అడిగి...
Super Star Rajinikanth: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమె యోగ క్షేమాలపై అడిగి తెలుసుకున్నారని శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ వెల్లడించారు. రజనీకాంత్ శశికళ ఆరోగ్యంపై ఆరా తీశారు. శశికళ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు అని మీడియాతో దినకరన్ తెలిపారు. అయితే శశికళకు రజనీకాంత్ ఫోన్ చేయడం పట్ల తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన రజనీకాంత్.. అనంతరం ఆనారోగ్య కారణాలతో విరమించుకున్న విషయం తెలిసిందే. మరి శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల ఏదైనా రాజకీయం ఉందా..? అనే కోణంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ.. విడుదలైన తర్వాత సోమవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆమె రాకకు వేలాది మంది అభిమానులు, మద్దతుదారులు స్వాగతం పలికారు. దారి గుండా అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా, జయలలితకు తానే వారసురాలినని అంటూ సోమవారం చిన్నమ్మ సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు అన్నాడీఎంకేలోని కోట్లాది మంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. చిన్నమ్మ ప్రకటనతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి.