AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niti Aayog Meeting: ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?

ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?

Niti Aayog Meeting: ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?
Chandrababu Naidu, Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Jul 27, 2024 | 7:15 AM

Share

ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే సీఎంల అజెండా ఏంటి?.. బాయ్‌కాట్‌ చేస్తున్న ముఖ్యమంత్రులు చెప్తున్న రీజన్‌ ఏంటి?..

నేడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. పోలవరం కొత్త డయాఫ్రమ్‌ వాల్ నిర్మాణం, అమరావతి నిర్మాణ ప్రతిపాదనలే అజెండాగా.. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్-2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్‌ రూపకల్పన చేసింది. దానిలోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో వివరించనున్నారు.

అలాగే.. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలతోపాటు.. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో తెలియజేస్తారు సీఎం చంద్రబాబు. అటు.. నీతి ఆయోగ్ సమావేశానికి ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపులపై కృతజ్ఞతలు తెలపనునున్నారు.

ఇదిలావుంటే.. ఇండి కూటమి సీఎంలతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సుఖూ, కేరళ సీఎం పినరయి విజయన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయానికి నిరసనగానే మీటింగ్‌కు వెళ్లడం లేదని తెలిపారు. అంతేకాదు.. తమ రాష్ట్రాలపై కక్ష కట్టిన కేంద్రం తీరును ఎండగడతామని నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని.. బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు, పథకాలు కేటాయించక పోవడంతోనే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కావడంలేదని కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్న రేవంత్‌.. తొలి నిరసనగా నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని ఆరోపించారు సీఎం రేవంత్‌. అటు.. తమిళనాడు సీఎం స్టాలిన్.. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయడమే కాకుండా.. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక, స్టాలిన్‌ నిరసన బాటలోనే మరికొందరు ముఖ్యమంత్రులు పయనించబోతున్నారు.

మొత్తంగా.. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నీతి ఆయోగ్‌ భేటీకి హాజరవుతుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బాయ్‌కాట్‌ చేస్తున్నారు. అయితే.. కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలతో ఏకంగా ఏడు రాష్ట్రాల సీఎంలు.. నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బాయ్‌కాట్‌ చేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో.. నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేస్తున్న ముఖ్యమంత్రుల ఎపిసోడ్‌పై కేంద్రం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..