Big Story: ఇండియాపై చైనా ‘పన్నాగాలు’… నాడే హెచ్ఛరించిన అజిత్ దోవల్
ఇండియాపై కక్ష పెంచుకున్న చైనా.. గతంలోనే ఎన్నోసార్లు కుయుక్తులు పన్నిందని, కేంద్రంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి నానా ప్రయత్నాలు చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఏడేళ్ల క్రితమే ఆయన చైనా పన్నాగాలపై..
ఇండియాపై కక్ష పెంచుకున్న చైనా.. గతంలోనే ఎన్నోసార్లు కుయుక్తులు పన్నిందని, కేంద్రంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి నానా ప్రయత్నాలు చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఏడేళ్ల క్రితమే ఆయన చైనా పన్నాగాలపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా ఫలితం లేకపోయిందట. భారత్ కు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ ఎన్నోసార్లు గూఢచర్యం నెరపిందని, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు సమకూర్చిందని ఆయన తెలిపారు. ‘చైనీస్ ఇంటెలిజెన్స్.. ఫ్రమ్ ఎ పార్టీ ఔట్ ఫిట్ టు సైబర్ వారియర్స్’ అనే తన పుస్తకంలో ఆయన ఈ దిగ్భ్రాంతికర విషయాలను వివరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ కూడా అయిన అజిత్ దోవల్.. ఇండియాతో బాటు పలు దేశాల్లో చైనా గూఢచారులు యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. 1959 లో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తన సుమారు 80 వేల మంది అనుచరులతో ఇండియాలో శరణార్థిగా వఛ్చినప్పటి నుంచి చైనా తన గూఢఛార కార్యకలాపాలను పెంచిందన్నారు. అకాలీ చిన్ ఏరియాలో లాసాను, జిన్ జియాంగ్ ను కలిపే రోడ్డును నిర్మించడం ఆరంభించింది, 2013 లో పేమా సెరింగ్ అనే గూఢచారిని హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో అరెస్టు చేశారు.. ఆ వ్యక్తి దలైలామా కార్యకలాపాలపై కొన్ని నెలలపాటు గూఢచర్యం చేస్తూ వచ్చాడు అని అజిత్ దోవల్ పేర్కొన్నారు.
2011 జనవరి 18 నవాంగ్ కింగ్ అనే మహిళా గూఢచారిని నాగాలాండ్ లో అరెస్టు చేశారని, ఆమెకు ఆ రాష్ట్ర తీవ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ మిలిటెంట్ బృందాల పేర్లను కూడా ఆయన వివరించారు. దీనిపై అప్పట్లో ఇండియా ఆ దేశానికి నిరసన తెలిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇంతేకాదు.. 1966 లోనే 300 మంది నాగా మిలిటెంట్లు చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందారని, వారు ఆ దేశం నుంచి భారీ ఎత్తున ఆయుధాలను దొంగచాటుగా ఇండియాకు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలు బ్యాంకాక్ కు చెందిన ఓ ఏజంట్ నుంచి బంగ్లాదేశ్ కు, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలివచ్ఛేవి కూడా అని అజిత్ దోవల్ తెలిపారు. పైగా ఇండియా పై ఏదో విధంగా పగ తీర్చుకునేందుకు చైనా… పాకిస్తాన్ కి చెందిన ఐ ఎస్ ఐ సహాయం కూడా తీసుకునేదన్నారు. అనేక సందర్భాల్లో పాక్, చైనా ఈ విషయంలో కుమ్మక్కు అయ్యాయని పేర్కొన్నారు.
ఈ నెల 15 న గాల్వన్ లోయవద్ద జరిగిన ఇండో-చైనా దళాల ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటన నేపథ్యంలో అజిత్ దోవల్ బయటపెట్టిన ఈ విషయాలు సంచలనం రేపుతున్నాయి.