కోవిడ్ కేసుల అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం, టాస్క్ ఫోర్స్ సభ్యుల సూచన
దేశంలో పెరిగిపోతున్న కోవిద్ కేసుల అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని టాస్క్ ఫోర్స్ సభ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరస్ ట్రాన్స్ మిషన్ ని బ్రేక్ చేయాలంటే..
దేశంలో పెరిగిపోతున్న కోవిద్ కేసుల అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని టాస్క్ ఫోర్స్ సభ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరస్ ట్రాన్స్ మిషన్ ని బ్రేక్ చేయాలంటే ఇది తప్పదని .ఎయిమ్స్, ఐసీఎంఆర్ తదితర మెంబర్స్ లో చాలామంది పరోక్షంగా ఈ మేరకు సిఫారసు చేశారు. డబుల్ మ్యుటెంట్ కారణంగా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని, ఇది ప్రమాదకరమని, హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తింటుందని ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ రణదీప్ గులేరియా వంటివారు పేర్కొన్నారు. కఠిన లాక్ డౌన్ మేలన్నది వారి అభిప్రాయం. మినీ లాక్ డౌన్ల వల్ల ఫలితం లేదని, కొన్ని రాష్ట్రాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోందని వారు పేర్కొన్నారు . వైరస్ అదుపునకు లాక్ డౌన్ చివరి పరిష్కారమని ఇటీవల ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అయితే పరిస్థితి మాత్రం ఈ కఠిన ఆంక్షలు మేలని సూచిస్తోందని ఈ నిపుణులు అంటున్నారు.దేశంలో 24 గంటల్లో 4 లక్షలకు పైగా కేసులు నమోదవడం, మూడున్నరవేలమంది మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని, వివిధ దేశాలు మన దేశం నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయని టాస్క్ ఫోర్స్ సభ్యులు గుర్తు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో 97 వేల కేసులు నమోదయితే అప్పుడు అదే చాలా పెద్ద సంఖ్యగా భావించామని, ఇప్పుడు ఏకంగా లక్షల సంఖ్యకు చేరుతోందని వీరు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా వైట్ హౌస్ లో చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఫాసీ కూడా ఇండియాలో కొన్ని వారాలు లాక్ డౌన్ విధించాలని సూచించారు. అప్పుడే కేసులు అదుపులోనికి వస్తాయన్నారు.