Murugha Mutt Seer: లైంగిక వేధింపుల కేసుపై మౌనం వీడిన లింగాయత్ మఠాధిపతి.. ఏమన్నారంటే..?
శివమూర్తి స్వామీజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. కిడ్నాపింగ్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. లింగాయత్ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Murugha Mutt Seer: కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ మఠాధిపతి లైంగికదాడి కేసు సంచలనం రేపుతోంది. చిత్రదుర్గకు చెందిన మురుగ రాజేంద్ర విద్యాపీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారు (Shivamurthy Murugha Sharanaru).. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. శివమూర్తి స్వామీజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. కిడ్నాపింగ్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. లింగాయత్ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కోర్టులో స్వామీజీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదని మఠానికి తిరిగి వచ్చిన తరువాత శివమూర్తి స్వామీజీ ప్రకటించారు. స్వామీజీపై కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై పేర్కొన్నారు. అయితే స్వామీజీని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పలు చోట్ల ఆందోళనలు సైతం జరగుతున్నాయి. అయితే.. శివమూర్తి స్వామీజీకి మాజీ సీఎం యడియూరప్ప సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. దీంతో స్వామీజీ వ్యవహారంపై రాజకీయ రగడ రాజుకుంది. బాధితులను గట్టి భద్రత మధ్య చిత్రదుర్గ ఆశ్రమానికి తీసుకొచ్చి స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆశ్రమంలో ఎక్కడ అఘాయిత్యం జరిగిందన్న విషయంపై విచారించారు.
ఎందరో ప్రముఖులు మురుగ రాజేంద్ర మఠానికి వస్తుంటారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్‌షా, నడ్డా లాంటి ప్రముఖులు కూడా మఠాన్ని సందర్శించారు. ఆశ్రమంలో బాలికలపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రదుర్గం ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చిన బాలికలు స్వచ్చంధ సంస్థ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే శివమూర్తి స్వామీజీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు అంటున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..