AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్కా నమిలి అసెంబ్లీలోనే ఉమ్మిన ఎమ్మెల్యే.. స్పీకర్ సీరియస్

ఆయన గౌరవ శాసనసభ్యుడు. ఎంతో మంది ప్రజలు ఓట్లు వేసి ఆయన్ను అసెంబ్లీకి పంపారు. కానీ ఆ ఎమ్మెల్యే కనీస బాధ్యత లేకుండా వ్యవహరించారు. గుట్కా నమిలి అసెంబ్లీ ఆవరణలోనే ఊశారు. విషయం తన వద్దకు రావడంతో.. స్పీకర్ సీరియస్ అయ్యారు. సదరు ఎమ్మెల్యే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి చేసిన తప్పుకు క్షమాపణల కోరాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

గుట్కా నమిలి అసెంబ్లీలోనే ఉమ్మిన ఎమ్మెల్యే.. స్పీకర్ సీరియస్
Vidhan Sabha
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 2:06 PM

Share

“నా పేరు ముఖేశ్.. గుట్కా, తంబాకు కారణంగా నాకు నోటి క్యాన్సర్ వచ్చింది. నా వైద్యం కోసం మా అమ్మ తన చేతి గాజులు రెండూ అమ్మేసింది”.. ఈ డైలాగులు సినీ ప్రియులందరికీ సుపరిచితమే. ఏ భాషా చిత్రమైనా సరే.. విధిగా ఈ ప్రకటన ఆయా భాషల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. గుట్కా, పాన్ పరాగ్ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రాణాంతకమో చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటనలు రూపొందించి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సరే, దేశంలో గుట్కా, తంబాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం అమలు చేస్తున్నా సరే.. వాటి వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినవారే గుట్కాలు, పాన్ మసాలాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతున్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఈ గుట్కా ఉమ్ములతో ఏర్పడ్డ మరకలే దర్శనమిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే పవిత్ర స్థలాలుగా భావించే ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా తుఫుక్.. తుఫుక్ అంటూ ఉమ్మేస్తుంటారు. అందమైన పరిసరాలను ఉమ్ములతో అపరిశుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీని సైతం వదలకుండా గుట్కా నమిలి ఉమ్మేశారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసెంబ్లీలో గుట్కా ఉమ్ము.. స్పీకర్ సీరియస్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సెషన్ 9వ రోజు (మంగళవారం) ఓ దృశ్యం అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానాకు ఆగ్రహం, అసహనం తెప్పించింది. ఆయన సభకు హాజరయ్యేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో అసెంబ్లీ లోపల కార్పెట్ మీద గుట్కా నమిలి ఉమ్మిన మరకలను గుర్తించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయించారు. సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ఆ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఇదొక క్రమశిక్షణారాహిత్యమైన చర్య అని మండిపడ్డారు. మిగతా ఎమ్మెల్యేలను అభ్యర్థిస్తూ ఇలాంటి చెత్త పనులకు పాల్పడవద్దంటూ హితవు పలికారు.

“మన సహచర సభ్యుల్లో ఒకరు ఈ పని చేశారు. ఇది మనందరి సభ. దాన్ని పరిశుభ్రంగా, గౌరవప్రదంగా ఉంచడం మనందరి బాధ్యత. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని సీసీటీవీ కెమేరా ద్వారా గుర్తించాను. ఆ సభ్యుడు తనంతట తానుగా ముందుకొచ్చి తప్పును అంగీకరిస్తే ఫర్వాలేదు. లేదంటే నేనే అతడికి ఫోన్ చేయాల్సి ఉంటుంది” అంటూ స్పీకర్ సతీశ్ మహానా అన్నారు. ఉమ్మివేసిన ఎమ్మెల్యే పేరును స్పీకర్ ప్రకటించకుండా ఈ చురకలు అంటించారు. మరోసారి ఇలాంటి తప్పు పురనావృతం కావద్దని ఆయన అన్నారు. యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5తో ముగియనున్నాయి. ఈలోగా గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే ముందుకొస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..