AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission 2024: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 లక్ష్యం.. ఆ 160 సీట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?

2024 General Elections: టార్గెట్ 350.. అవును. భారతీయ జనతా పార్టీ (BJP) 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాలని నిర్దేశించుకున్న సీట్ల సంఖ్య ఇది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ, వరుసగా మూడోసారి కూడా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.

Mission 2024: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 లక్ష్యం.. ఆ 160 సీట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?
PM Narendra Modi, Amit Shah and JP Nadda
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 13, 2023 | 4:03 PM

Share

ఢిల్లీ, జులై 13:  టార్గెట్ 350.. అవును. భారతీయ జనతా పార్టీ (BJP) 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాలని నిర్దేశించుకున్న సీట్ల సంఖ్య ఇది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ, వరుసగా మూడోసారి కూడా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. మిత్రపక్షాలతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పేరుతో 2014లో పోటీ చేసి సొంతంగానే 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ, 2019లో తెలుగుదేశం వంటి కొన్ని మిత్రపక్షాలు దూరమైనప్పటికీ సొంత బలం 303 సీట్లకు పెంచుకుని, కూటమి సంఖ్యాబలాన్ని 353కు పెంచుకోగల్గింది. అడ్డగోలుగా నల్లధనం దాచిపెట్టిన బడాబాబులను లక్ష్యంగా చేసుకుని వదిలిన నోట్ల రద్దు అస్త్రం కాస్తా బెడిసికొట్టి సామాన్యులు సైతం ఇబ్బందులు పడ్డప్పటికీ.. మిగతా అంశాల్లో మార్కులు సంపాదించి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఇదే మాదిరిగా మూడోసారి కూడా మరిన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వరుసగా మూడోసారి గెలవడమే అత్యాశ అని ప్రతిపక్షాలు చెబుతుంటే, ఈసారి సొంతంగా 350 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం అంటే అతిశయోక్తేనన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ “మిషన్ 2024 – టార్గెట్ 350” వ్యూహాలు రచిస్తోంది.

ఆ 160 స్థానాల్లో లోక్‌సభ ప్రవాస్ యోజన

గత సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ, పోటీ చేసిన మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైంది. అందులో కొన్ని కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. గెలిచిన స్థానాలతో సరిపుచ్చుకుంటే సరిపోదని, ఓడిన చోట ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. అలా ఓడిపోయిన స్థానాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 160 సీట్లలో బీజేపీ రెండో స్థానంలో ఉంది. అందులో కొన్నింటిలో తక్కువ మార్జిన్‌తో ఓటమిపాలైంది. ఇలాంటి చోట దృష్టిపెడితే ఈసారి అందులో సగం సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. తద్వారా బలం ఉన్న చోట కొన్ని సీట్లు తగ్గినా భర్తీ చేసుకోవచ్చని అంచనా వేసుకుంటున్నారు. ఆ క్రమంలో పార్టీ ‘లోక్‌సభ ప్రవాస్ యోజన’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గత 9 నెలల నుంచి ఈ 160 లోక్‌సభ స్థానాల్లో నిత్యం పార్టీ ప్రముఖ నేతలు ఏదో ఒక రూపంలో పర్యటిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడమే కాదు, ఒక పూట అక్కడే బస చేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితులపై ప్రత్యక్షంగా అవగాహన తెచ్చుకుంటున్నారు. రెండు నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలను కలిపి క్లస్టర్లుగా విభజించి, వాటి బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగిస్తున్నారు. ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా టాస్క్ అందుకున్న నేతలు ఆయా క్షేత్రాల్లో పర్యటించి, బస చేయాల్సి ఉంటుంది. అయితే గత 9 నెలల కాలంలో ఈ కార్యక్రమం అమలు జరిగిన తీరు, లోటుపాట్లను పార్టీ జాతీయాధ్యక్షులు ఇటీవల సమీక్షించారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ 160 స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల గెలుపొందడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

ఉత్తర్ ప్రదేశ్ గెలిస్తే ఢిల్లీ గెలవవచ్చు అన్నది రాజకీయ నానుడి. 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో సాధించే మెజారిటీయే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారుతుందనేది దీనర్థం. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లను గెలుపొందింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఓటమిపాలైన 14 స్థానాల బాధ్యతలను బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో పాటు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, డాక్టర్ జితేంద్ర సింగ్, అశ్విని చౌబే, అన్నపూర్ణాదేవిలకు బాధ్యతను అప్పగించింది. ఈ తరహాలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ ముఖ్య నేతలతో పాటు కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..