సెమీకండక్టర్ పనితీరు ఇదే.. వచ్చే ఐదేళ్లలో భారతదేశమే పెద్దన్న.. అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..
చిన్న సెమీకండక్టర్ చిప్స్.. యావత్తు ప్రపంచ వ్యాపారంపై ప్రభావం చూపుతాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కార్ల వరకు.. ఈ చిన్న సైజ్ సెమీకండక్టర్ చిప్స్ అనేక రంగాల్లో ఓ ముఖ్యమైన భాగమయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే సెమీకండక్టర్ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా..
చిన్న సెమీకండక్టర్ చిప్స్.. యావత్తు ప్రపంచ వ్యాపారంపై ప్రభావం చూపుతాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కార్ల వరకు.. ఈ చిన్న సైజ్ సెమీకండక్టర్ చిప్స్ అనేక రంగాల్లో ఓ ముఖ్యమైన భాగమయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే సెమీకండక్టర్ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జాతీయ మీడియా సంస్థ ‘బృట్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అశ్విని వైష్ణవ్ సెమీకండక్టర్స్ గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
చిప్ రంగం అనేది ఓ ‘వేఫర్’ అనే పొరలాంటి పరికరంతో మొదలవుతుందన్నారు అశ్వినీ వైష్ణవ్. చిప్స్ కోసం బంగాళదుంపను ఎలాగైతే ముక్కలుగా కట్ చేస్తామో.. సిలికాన్‌తో తయారైన పెద్ద పెద్ద దుంగలను కూడా ముక్కలుగా కోసి.. ఇలాంటి ‘వేఫర్స్’ను రూపొందిస్తారని తెలిపారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారతదేశ సెమీకండక్టర్స్.. ఇండియా చిప్ మేకింగ్ కోసం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలైన ఐబీఎం, ఏఎండీ, ఫాక్స్‌కాన్‌లను ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రతీ వేఫర్ పైభాగంలో చిన్న చిన్న చిప్స్ అనేవి ప్లాస్మా, లేజర్ వంటి వాటితో రూపొందించబడి ఉంటాయి. ఆపై మళ్లీ చాలా క్లిష్టమైన ప్రక్రియను ఉపయోగించి ప్రతీ చిప్‌ను ఆ పొర నుంచి బయటకు తీస్తారు. ఆ సమయంలో ఆ చిప్ కంటూ.. ఓ శరీరం ఒకటి ఇవ్వాలి. దానికి చుట్టూ సరైన వైరింగ్ చేయడమే కాదు.. విద్యుత్ సరఫరాను కూడా అందివ్వాలి. దీన్నంటిని కూడా వేరే ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా చేస్తారు.
ఓ చిన్న మైక్రోచిప్.. దాని లోపల కిలోమీటర్ల వైరింగ్ చుట్టుకుని ఉంటుంది. ఎలాగంటే.! ఐదు లేదా ఆరంతస్తుల బిల్డింగ్‌కు ఎలాగైతే మెట్లు, లిఫ్ట్, కరెంట్, ప్లంబింగ్.. ఇలా ఎన్నో రకాల కనక్షన్లు ఉంటాయో.. ఈ చిన్నసైజ్ చిప్‌లో ఏకంగా ఐదు అంతస్తుల చిప్స్ దాగి ఉంటాయి. ఇందులోని ఎక్కువ భాగం భారతదేశంలోనే ఉత్పత్తి చేయబడుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సెమీకండక్టర్లు అనేవి భారతదేశంలో తయారు చేయబడితే.. ఇక్కడున్న పలు కంపెనీలకు ఎంతగానో మేలు చేకూరుతుందని మంత్రి స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, టాబ్లెట్స్, ట్రైన్ సెట్స్, ఆటోమొబైల్స్, కార్స్, ఇలా చిన్నసైజ్ మైక్రోచిప్స్‌ను ఉపయోగించే ప్రతీ వస్తువును వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే చిప్స్ మన దేశంలో తయారవుతుండటంతో.. ఆయా వస్తువుల ధరలు కచ్చితంగా తక్కువ అవుతాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే యువతకు కూడా ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ద్వారా ఎలక్ట్రానిక్స్, టెలికాం ఎక్విప్‌మెంట్, ఆటోమొబైల్ రంగాలు లాంటివి అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
కాగా, ఈ సెమీకండక్టర్ రంగం అంచలంచలుగా పైపైకి ఎగబాకుతోందని.. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 650 బిలియన్ డాలర్లు ఉండగా.. వచ్చే ఆరు లేదా ఏడేళ్లలో ఆ విలువ కాస్తా రెండింతలు అవుతుందన్నారు. అలాగే మన భారతదేశం ఈ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు ఇదే సరైన సమయం అని అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా భారతదేశాన్ని నమ్ముతోందని.. మన ఫారిన్ పాలసీపై ఇతర దేశాలకు నమ్మకం ఉందని తెలిపారు. ఇతర దేశాల్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా మనవైపే చూస్తున్నాయని.. ఇక్కడికొచ్చి సెమీకండక్టర్లు తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రధాన సెమీకండక్టర్ తయారీదారులుగా భారతదేశం అవతరించబోతోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.