Manipur Violence: తిరుగుబాటుదార్లను ఉగ్రవాదులతో పోల్చిన మణిపూర్ సీఎం.. 40 మంది ఎన్‌కౌంటర్
మణిపూర్‌లో గత కొన్ని రోజులుగా అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో..
మణిపూర్ రాష్ట్రాం తగలబడిబోతోంది. రెండు తెగల మధ్య ఆధిపత్యపోరులో ఆ రాష్ట్రం హింసతో అల్లాడిపోతోంది. ఈ అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. ఎమ్-16, ఏకే-47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని, ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అల్లర్లలో ఇద్దరు పౌరులు కూడా చనిపోయారు. హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందే తిరుగుబాటుదారులను ప్రభుత్వం అణచివేసింది. ఇక ఈ రోజు అమిత్ షా మణిపూర్ ను సందర్శంచనున్నారు.
మే 28 రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంఫాల్ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్, సెరయు ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మందికిపైగా వ్యక్తులు బుల్లెట్ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు. మరోవైపు అల్లర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని పాటించి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని ఇప్పటికే మెయిటీ, కుకీ గిరిజన తెగ వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
కాగా ఎస్టీ హోదా కోసం మణిపూర్ రాష్ట్రంలో గత కొంత కాలంగా నిరసనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మెయిటీల డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.