Uttar Pradesh: రామాయణం నాటక ప్రదర్శనలో విషాదం.. గుండెపోటుతో హనుమాన్ వేషధారి మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా సేలంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాంలీలాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్న..
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా సేలంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాంలీలాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్న 50 ఏళ్ల వ్యక్తి వేదికపైనే మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రాంలీలా నాటకలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రామ్ స్వరూప్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. తోకకు నిప్పు అంటించిన సమయంలో భయాందోళనకు గురైన రామ్ స్వరూప్ గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు.
ఘటనా సమయంలో రామ్ స్వరూప్ భార్య అనసూయ, ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. జీవనోపాధి కోసం బండి నడిపే రామ్ స్వరూప్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేసిన నాటకలో ప్రదర్శన చేశాడు. అయితే, రామ్ స్వరూప్ మృతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధాత ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. 30 నుంచి 50 ఏళ్ల లోపు వారు డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తే అకస్మాత్తుగా పడిపోవడం, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొద్ది రోజులు క్రితం.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు గర్బా మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అంతకు ముందు జమ్మూలో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కిందపడి ఓ డ్యాన్స్ ఆర్టిస్ట్ చనిపోయాడు.
పార్వతి దేవి వేషంలో ఉన్న 20 ఏళ్ల యోగేష్ గుప్తా అనే కళాకారుడు బిష్నాలోని గణేష్ ఉత్సవంలో ప్రదర్శన ఇస్తుండగా, ఒక్కసారిగా కుప్పకూలి వేదికపై పడిపోయాడు. అంతకు ముందు, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో 48 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు పార్టీలో డ్యాన్స్ చేస్తూ మరణించాడు. మెయిన్‌పురిలో జరిగిన మరో సంఘటనలో గణేష్ చతుర్థి సందర్భంగా ప్రదర్శించిన నాటకంలో రవి శర్మ అనే యువకుడు హనుమంతుని పాత్రను పోషిస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
फतेहपुर के धाता में दुर्गा पूजा पंडाल के एक कार्यक्रम में हनुमान की भूमिका निभा रहे 55 साल के रामस्वरूप की मौत, लंकादहन के दौरान चक्कर खाकर मंच से गिरे और चली गई जान @CMOfficeUP @sengarlive @navalkant pic.twitter.com/iR3WZQAlYo
— rishabh mani (@rishabhmanitrip) October 2, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..