INDIA Alliance: ముగిసిన ఇండియా కూటమి భేటీ.. ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే ..!
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత ప్రతిపాదించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడీవేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత ప్రతిపాదించారు. మమత ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమర్ధించారు. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అయితే మొదట ఎన్నికల్లో గెలుద్దామని , తరువాత ప్రధాని అభ్యర్ధిపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు, తదితర అంశాలపై మూడు గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయి.
ఈ సమావేశంలో 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపిచ్చింది. సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న ఖర్గే.. సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని.. తమ చింత, దృష్టి అంతా ముందు గెలవడం పైనే అంటూ పేర్కొన్నారు. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారంటూ క్లారిటీ ఇచచారు.
దేశ ప్రజల సక్షేమం కోసం కలిసి పనిచేయాలని తాము నిర్ణయించినట్టు ఖర్గే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా 8-10 సమావేశాలు నిర్వహించాలని కూడా కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత సోనియాగాంధీ, జైరాం రమేశ్ , ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ , బీహార్ సీఎం నితీష్‌కుమార్ , తమిళనాడు సీఎం స్టాలిన్ , లెఫ్ట్ నేతలు , టీఎంసీ నేతలు హాజరయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూయాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన ఉద్దవ్ ఠాక్రే , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు.
కాగా.. ఇండియా కూటమి నేతలు సమావేశం కావడం ఇది నాలుగోసారి . పాట్నాలో తొలిసారి కూటమి సమావేశం జరిగింది. తరువాత బెంగళూర్, ముంబైలో కూడా నేతలు సమావేశమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..