Uddhav Thackeray: సొంతవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భావోద్వేగం..
గెలవలేని వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించామని.. సొంత వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తిరుగుబాటును తాను ముందే అనుమానించానని.. కానీ ఏక్నాథ్ షిండే ఇలా చేస్తారని అనుకోలేదని పేర్కొన్నారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గెలవలేని వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించామని.. సొంత వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తిరుగుబాటును తాను ముందే అనుమానించానని.. కానీ ఏక్నాథ్ షిండే ఇలా చేస్తారని అనుకోలేదని పేర్కొన్నారు. వారంతా బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్-ఎన్‌సీపీ తనకు మద్దతిస్తున్నాయని సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు. సొంతవాళ్లు ద్రోహం చేసినా.. శరద్ పవార్, సోనియాగాంధీ తమకు మద్దతిచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శివసేన కార్పొరేటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రశ్న “ఎవరికీ తలెత్తదు” అని థాక్రే పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం తనకు ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు, తాను ఏక్‌నాథ్ షిండేకి ఫోన్ చేసి, ఇలా చేయడం సరికాదు.. శివసేనను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిర్వర్తించమని చెప్పానన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్‌లు మనల్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, బీజేపీతో కలిసి వెళ్లాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.. ఆ ఎమ్మెల్యేలను తన వద్దకు తీసుకురావాలంటూ సూచించానని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. చివరకు తమ పార్టీ, కుటుంబ పరువు తీశారని.. ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు.. అంటూ ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు.
తాము ఒకప్పుడు బీజేపీతోనే ఉన్నామని.. దాని పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బీజేపీ శివసేనను అంతమొందించాలనుకుంటుందని.. ఆరోపించారు. శివసేన కత్తిలాంటిది.. బయటకు తీస్తే మెరుస్తుంది. ప్రకాశించే సమయం వచ్చిందంటూ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
సీఎం పదవిపై అత్యాశ లేదు
తన కుటుంబాన్ని బీజేపీ ఇబ్బంది పెట్టిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేనలో ద్రోహులు అక్కర్లేదని.. బాలాసాహెబ్‌పై గౌరవం, ప్రజల వల్లే ఈ ఎమ్మెల్యేలంతా గెలిచారని ఉద్ధవ్ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా శివసైనికులను అంగీకరించకపోతే రాజీనామాకు సిద్ధమని ఉద్ధవ్ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఇంతకు ముందు కూడా కోరిక లేదని, అది ఈరోజు కాదు భవిష్యత్తులో కూడా ఉండదని ఉద్ధవ్ స్పష్టంచేశారు.
పుకారు వ్యాప్తి చెందుతోంది
రెబల్స్‌గా మారిన ఎమ్మెల్యేలకు బీజేపీలో చేరడం తప్ప మరో మార్గం లేదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి వెళ్లాలని చెబుతున్నారు. హిందుత్వ విషయంలో బీజేపీకి మరే ఇతర పార్టీ అక్కర్లేదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ తిరుగుబాటు వెనుక తన హస్తం ఉందని ప్రచారం జరుగుతుందని.. తానేందుకు తన పార్టీకి వెన్నుపోటు పొడుచుకుంటానని పేర్కొన్నారు.
Many of you might be getting phone calls – some loving & some threatening. I say, har sher ko sava sher milta hi hai. You’ll find sava sher in Shiv Sena. Shiv Sena like a sword, if you keep it in sheath,it rusts. If you take it out,it shines. It’s time to shine: Uddhav Thackeray pic.twitter.com/HXg4xqeyAl
— ANI (@ANI) June 24, 2022
కాగా.. శుక్రవారం శివసేన జిల్లా నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం మధ్యాహ్నం 1 గంటకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..