Maharashtra: ఫడ్నవీస్ సీఎం, షిండే-పవార్ డిప్యూటీ సీఎం.. మహారాష్ట్ర ప్రభుత్వ ఫార్ములా సెట్ అయిందా?

మహాయుతికి చెందిన నాయకులు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ఈరోజు(నవంబర్ 25) ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారని సమాచారం.

Maharashtra: ఫడ్నవీస్ సీఎం, షిండే-పవార్ డిప్యూటీ సీఎం.. మహారాష్ట్ర ప్రభుత్వ ఫార్ములా సెట్ అయిందా?
Devendra Fadnavis, Eknath Shinde, Ajit Pawar
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 25, 2024 | 3:22 PM

కౌన్‌ బనేగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి..! ఇంకా చెప్పాలంటే కిస్సా కుర్సీకా. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. కలిసి పోటీచేసి గెలిచిన మూడు పార్టీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా లాబీయింగ్‌ చేస్తున్నాయి. బలాలు చాటుతూ మూడు పార్టీలు బిజీగా ఉన్నాయి.

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయూతి నియోజక వర్గ సమావేశాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నా అధికారికంగా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి మహాయుతిలో అజిత్ వర్గానికి ఎలాంటి అభ్యంతరం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫడ్నవీస్ సీఎం అయితే, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రులు కావచ్చు. అంటే ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఏంలు. కూటమి పాత ఫార్ములాను అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి భారీ శాఖలు ఇవ్వవచ్చు. అలాగే తమ పార్టీ కోటా నుంచి 10 లేదా 12 మంది మంత్రులు కావాలంటున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కవచ్చని సమాచారం. దీంతోపాటు దాదాపు 10 మంత్రి పదవులు కూడా ఆయన పార్టీ ఖాతాలోకి రావచ్చు. ఇది కాకుండా బీజేపీ కోటా నుండి 20 లేదా 22 మంది మంత్రులను చేయవచ్చు. అయితే సీఎం షిండే లాడ్లీ బెహన్ స్కీమ్ తీసుకొచ్చి రెండున్నరేళ్లు మంచి పని చేశారని, అందుకే మొదట్లో ఆయనకు మరోసారి సీఎం పదవి దక్కాలని షిండే శివసేన కోరుతోంది. మరోవైపు, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. దీని తర్వాత బీజేపీ అగ్ర నాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం ఉంటుంది. సీఎం పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారన్న సమాచారం బలంగా వినిపిస్తోంది.

అయితే సీఎం పదవిని ఆశిస్తున్న ముగ్గురు నేతల వాదన ఎలా ఉందో చూద్దాం.. తాము ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని దేవేంద్ర ఫడ్నవీస్‌ అంటున్నారు. అంతేగాకుండా, కూటమి కోసమే తాను డిప్యూటీ సీఎంగా పనిచేశానని ఆయన చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే కూటమికి భారీ విజయం దక్కిందని ఫడ్నవీస్‌ వాదిస్తున్నారు.

ఇక ఏక్‌నాథ్‌ షిండే మళ్లీ ముఖ్యమంత్రి సీటును ఆశిస్తున్నారు. తన రెండున్నరేళ్ల పాలనకు ఈ ఎన్నికల్లో జనామోదం లభించిందని ఆయన అంటున్నారు. అంతేగాదు, బీజేపీ కోసం తాను శివసేనను చీల్చినట్లు గుర్తుచేస్తున్నారు. అలాగే, అజిత్‌ పవార్‌ను నమ్ముకోవద్దంటూ షిండే సలహా ఇస్తున్నారు. ఫడ్నవీస్‌, షిండేకి తగ్గకుండా NCP నేత అజిత్‌ పవార్‌ కూడా సీఎం రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన పార్టీ నేతలు ఈ పాయింట్‌ను వినిపిస్తున్నారు. CM కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అంటూ అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ అంటున్నారు. మరోవైపు అజిత్‌ పవార్‌ అన్ని వర్గాల కోసం పనిచేశారని ఆ పార్టీ నేత ధీరజ్‌ శర్మ చెబుతున్నారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి, సీనియారిటీ ప్రకారం అజిత్‌ పవార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

మహాయుతికి చెందిన నాయకులు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ఈరోజు(నవంబర్ 25) ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారని సమాచారం. కాగా, నిన్న ముంబైలో శివసేన షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఇందులో పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకనాథ్ షిండే పేరును ఉదయ్ సమంత్ సమర్పించగా, అది ఏకగ్రీవంగా ఆమోదించారు. శివసేన నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేకు తన పార్టీ నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఇచ్చారు. ఎన్సీపీ కూడా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకుంది.

సీఎం పదవి కోసం పోటీ జరుగుతున్న మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఫడ్నవీస్‌ నేతృత్వంలో పోరాడిన బీజేపీకి 132 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక శివసేన షిండే పార్టీకి 57 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరోవైపు అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని NCP తరపున 41 మంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..