Alpine Divorce : సోషల్ మీడియాలో ‘ఆల్పైన్ విడాకులు’ ప్రకంపనలు.. ప్రేమించిన వ్యక్తిని కొండల మీద వదిలేయడమే ట్రెండా?
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో రిలేషన్ షిప్స్ విషయంలో వస్తున్న కొన్ని ట్రెండ్స్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అనేవి ఒక ఎత్తైతే.. విడిపోయే పద్ధతిలో చూపిస్తున్న క్రూరత్వం మరో ఎత్తు.

ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కొత్త పదం ‘ఆల్పైన్ విడాకులు’. వినడానికి ఏదో వెరైటీగా ఉన్నా, దీని వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు పర్వత ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి వెళ్లారు. మంచు కురుస్తున్న వేళ, చుట్టూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. కానీ, ఒక్క క్షణంలో పరిస్థితి తలకిందులైంది. నమ్మిన భాగస్వామి ఎటువంటి హెచ్చరిక లేకుండా అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం దారి తెలియదు, తిండి లేదు.. చుట్టూ ప్రాణాంతకమైన చలి. దీనినే ఇప్పుడు నెటిజన్లు ‘ఆల్పైన్ విడాకులు’ అని పిలుస్తున్నారు. ఇది ఒక చట్టపరమైన విడాకుల ప్రక్రియ కాదు, ఇదొక భయంకరమైన ఇంటర్నెట్ ట్రెండ్.
ఆల్పైన్ విడాకులు అంటే..
ట్రెక్కింగ్ లేదా పర్వత యాత్రలకు వెళ్ళినప్పుడు, భాగస్వామిని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి రావడాన్ని ‘ఆల్పైన్ విడాకులు’గా వ్యవహరిస్తున్నారు. స్విస్ ఆల్ప్స్ లేదా స్కాట్లాండ్ వంటి ఎత్తైన, ప్రమాదకరమైన కొండ ప్రాంతాల పేరు మీద దీనిని సృష్టించారు. అక్కడ వాతావరణం క్షణక్షణానికి మారిపోతుంటుంది. అటువంటి చోట ఒక వ్యక్తిని వదిలేయడం అంటే వారిని మృత్యువుకు చేరువ చేయడమే. 2026 ప్రారంభంలో ఒక పెంగ్విన్ వీడియో వైరల్ అయిన తర్వాత, ఈ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించింది.
ఈ పదం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దీని మూలాలు 1893లో రాబర్ట్ బార్ రాసిన ‘ఎన్ ఆల్పైన్ డివోర్స్’ అనే కథలో ఉన్నాయి. ఆ కథలో ఒక వ్యక్తి తన భార్యను స్విట్జర్లాండ్ యాత్రలో ప్రమాదకర పరిస్థితుల్లో వదిలించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అది అప్పట్లో ఒక కల్పిత కథ. కానీ, నేటి నెటిజన్లు దానిని ఒక రిలేషన్ షిప్ ట్రెండ్‌గా మార్చేశారు. చాలా మంది మహిళలు తాము ట్రెక్కింగ్ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోవడంతో ఇది మరింత వైరల్ అయ్యింది.
ప్రమాద హెచ్చరిక..
మానసిక నిపుణులు దీనిని ఒక తీవ్రమైన ‘రెడ్ ఫ్లాగ్’గా (ప్రమాద హెచ్చరిక) పరిగణిస్తున్నారు. ప్రేమించిన వ్యక్తిని అంతటి అభద్రతా భావంలోకి నెట్టడం అనేది ముమ్మాటికీ నమ్మకద్రోహమే. కొంతమంది దీనిని ‘డార్క్ హ్యూమర్’ అని కొట్టిపారేస్తున్నా, దీని వెనుక ఉన్న క్రూరత్వాన్ని విస్మరించలేం. ఈ ట్రెండ్ పెరగడంతో పర్వతారోహకులు కొన్ని భద్రతా సూచనలు ఇస్తున్నారు.
ఎవరితో వెళ్ళినా సరే, మీ సొంత మ్యాప్, ఆహారం, అత్యవసర వస్తువులను మీ దగ్గరే ఉంచుకోవాలని, ఎవరిపైనా 100 శాతం ఆధారపడకూడదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ అప్పుడప్పుడు వినోదాన్ని పంచవచ్చు, కానీ ఇలాంటి ప్రాణాంతకమైన ధోరణులు మానవ సంబంధాల మధ్య ఉన్న నమ్మకాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. భౌతిక దూరం కంటే మానసిక క్రూరత్వం ఎక్కువగా ఉన్న ఇలాంటి ట్రెండ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
