High Court: సమయానికి రాని అంబులెన్స్.. వైద్యం అందక బాలింత మృతి.. పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం!
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Madras High Court orders compensation to man: సిబ్బంది నిర్లక్ష్యంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం బాధిత కుటుంబానికి చెల్లించాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో నిర్లక్ష్యాన్ని, ఆలస్యాన్ని క్షమించడకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన లింగదురై భార్య ప్రసవం కోసం గత నెల 25న రాజకమంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారు. తర్వాతి రోజు ఆమెకు మగబిడ్డ జన్మించాడు. అయితే, డెలివరీ తర్వాత ఆమెకు భారీ రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది.
దీంతో ఆమెను వెంటనే సమీపంలోని అరసిపల్లం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించాలని పీహెచ్‌సీ వైద్యులు సూచించారు. అయితే, ఆ పీహెచ్‌సీ వద్ద అంబులెన్స్ అందుబాటులో లేదు. సదరు మహిళను పెద్దాసుపత్రికి తరలించాలని విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ 5:15 నిమిషాలకు 108కి అంబులెన్స్ గురించి ఫోన్ చేశారు. అరగంట తర్వాత 5:45కు అంబులెన్స్ వచ్చింది. అలస్యంగా వచ్చిన అంబులెన్స్ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడించింది. రాష్ట్ర ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింత మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.
దీంతో తన భార్య చావుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే అని పేర్కొంటూ లింగదురై.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని విచారించిన హైకోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. లింగదురైకు తమిళనాడు ప్రభుత్వం రూ.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.