బేతుల్ బొగ్గు గనిలో కుప్పకూలిన స్లాబ్.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని WCL ఛతర్‌పూర్-1 బొగ్గు గనిలో పెను ప్రమాదం సంభవించింది. గనిలోని ఒక దశ స్లాబ్ కూలిపోవడంతో చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం తరువాత, గని రెస్క్యూ బృందం, SDRF, పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు కార్మికులు మరణించారు.

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో గురువారం(మార్చి 6) సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. బొగ్గు గనిలో పైకప్పు కూలిపోయింది. దాని కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అధికారులు, రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు కార్మికులను శిథిలాల నుండి బయటకు తీశారు. వారు మరణించినట్లు వైద్యుల బృందం ప్రకటించింది.
బేతుల్ జిల్లాలోని సరణిలోని బాగ్డోనా-ఛతర్‌పూర్ గనిలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ యోగేష్ పండగ్రే, జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ, పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నిశ్చల్ ఝారియా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ సూర్యవంశీ సూచనల మేరకు, గనిలో పనిచేస్తున్న ఇతర కార్మికులను సురక్షితంగా తరలించడానికి వెంటనే సహాయక చర్య ప్రారంభించారు. అయితే, ముగ్గురు కార్మికుల మరణాన్ని ఎస్పీ నిశ్చల్ ఝారియా ధృవీకరించారు. మిగిలిన వారి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ప్రమాదంలో షిఫ్ట్ ఇన్‌చార్జ్ గోవింద్ కొసారియా (37), ఓవర్‌మెన్ హరి చౌహాన్ (46) , మైనింగ్ సర్దార్ రామ్‌దేవ్ పండోల్ (49) మరణించారు. లైఫ్ కవర్ స్కీమ్ కింద మరణించిన వారి కుటుంబాలకు వెంటనే రూ. 1.5 లక్షల సహాయం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ పండగ్రే, కలెక్టర్ సూర్యవంశీ వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు.
ఈ సంఘటన తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి మైనింగ్ భద్రతా ప్రమాణాలను సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




