Lok Sabha Strength: 1,000కి పెరగనున్న లోక్‌సభ మెంబర్స్ సంఖ్య? జాతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Lok Sabha Strength: పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంపుపై ఊహాగానాలు అంతే వేగంగా జోరందుకున్నాయి. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
Lok Sabha Seats: భవిష్యత్తు అవసరాలను తీర్చేలా భారీ సామర్థ్యంతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంపుపై ఊహాగానాలు అంతే వేగంగా జోరందుకున్నాయి. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపడేస్తోంది. అయితే రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత పార్లమెంట్ స్థానాల సంఖ్య కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కాస్త ముందుకు జరిపేలా రాజ్యాంగ సవరణ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేమీ కాదు. పైగా, సీట్లు పెరుగుతాయంటే ఏ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తుంది? కాకపోతే వచ్చిన సమస్యల్లా 2021 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెంచాలన్న నిబంధనే. ఇదే జరిగితే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుంది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించి, అభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించి శిక్ష విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా పార్లమెంట్‌లో లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన కొత్తదేమీ కాదు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న స్థానాల సంఖ్య 545. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ సభ్యులను తీసేస్తే, 543 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ కూడా లోక్‌సభ స్థానాల్ని 1,000కి పెంచాల్సిన అవసరముందని గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. జనాభాలో వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో 1,000 మంది ఎంపీలుంటే తప్పేంటని అన్నారు. 1977లో మన దేశ జనాభా కేవలం 55 కోట్లేనని, కానీ ఇప్పుడు 130 కోట్లు దాటిందని అన్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఇదే విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల్ని 1,000కి పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉందని ట్వీట్ చేశారు. తన సహచర బీజేపీ ఎంపీల ద్వారా ఈ సమాచారం తెలిసినట్టు పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్‌ని కూడా 1,000 మంది కూర్చునే సామర్ధ్యంతో నిర్మిస్తున్న విషయాన్ని తివారీ గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ స్థానాల్ని పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, లాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు.
I am reliably informed by Parlimentary colleagues in @BJP4India that there is a proposal to increase strength of Lok Sabha to 1000 or more before 2024. New Parliament Chamber being constructed as a 1000 seater. Before this is done there should be a serious public consultation.
— Manish Tewari (@ManishTewari) July 25, 2021
1971తో పోల్చితే దేశ జనాభా రెట్టింపు పెరిగింది కాబట్టి లోక్‌సభ సీట్ల సంఖ్య ఏకంగా 1,200కు పెంచనున్నట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య, రాష్ట్రాలవారిగా నిష్పత్తి ప్రకారం లెక్కగడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న 25 సీట్లు 52 పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 39కి పెరుగుతాయి. మొత్తం సీట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% నుంచి 4.3%కి పడిపోగా, తెలంగాణలో 3.1% నుంచి 3.3%కు పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాల్లో హైదరాబాద్ నగరానికి జరిగిన వలసల కారణంగా పెరిగిన జన సంఖ్య ఈ మార్పుకు కారణమైందని విశ్లేషించుకోవచ్చు. అలాగే జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుంచి 193కు పెరిగి, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 14.7% నుంచి 16%కు పెరగనుంది. తమిళనాడు ప్రాతినిధ్యం 7.2 శాతం నుంచి 6.4 శాతానికి, కేరళ ప్రాతినిధ్యం 3.7 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోతుంది. ఏరకంగా చూసినా జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి, అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ఈ విశ్లేషణ చెబుతోంది. 1971 నాటి జనాభా లెక్కలు లేదా ఇంకేదైనా కొత్త ఫార్ములాను అనుసరిస్తే తప్ప ఈ అన్యాయాన్ని సరిదిద్దలేని పరిస్థితి నెలకొంది.
రాజ్యాంగం ఏం చెబుతోంది? పార్లమెంటులో లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు గురించి ఆర్టికల్ 81లో పొందిపరిచి ఉంది. 2021 జన గణన ఆధారంగా ప్రస్తుతమున్న 545 స్థానాలను పెంచాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఆర్టికల్ 81(3) ప్రకారం 2026 వరకు లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయరాదు. 2026 తర్వాతే మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంటుంది. అలాగని ఇప్పటి వరకు లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు జరగలేదా అంటే.. జరిగాయి. 1952లో లోక్‌సభ సీట్ల సంఖ్య 489 మాత్రమే. ఆర్టికల్ 81, 81(3)కు సవరణలు చేయడం ద్వారా ఈ సంఖ్య 545కు చేరుకుంది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, 2001 వరకు అదే సంఖ్య కొనసాగాలని నాటి పార్లమెంట్ నిర్ణయించింది. 2001లో ఈ సంఖ్య పెరుగుతుందని అనుకున్నప్పటికీ, 2003లో నాటి పార్లమెంట్ 2026 వరకు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చేసిన 84వ రాజ్యాంగ సవరణలో కూడా 1971 నాటి జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య జనాభా పెరుగుదల నిష్పత్తిలో ఉన్న అసమతుల్యతే ఈ నిర్ణయానికి కారణమైంది. జనాభా నియంత్రణ విధానాలను పకడ్బందీగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించిన దక్షిణ భారత రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోయి, ఉత్తరాది రాష్ట్రాలకు మరింత పెరుగుతుందని చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచాలంటే ఆర్టికల్ 81(3)ను సవరించక తప్పని పరిస్థితి నెలకొంది.
పెంపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ యాక్ట్, 2002 ప్రకారం ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా అధ్యయనం చేసి, మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను ఎంతవరకు పెంచాలన్న అంశంతో పాటు ఏ రాష్ట్రంలో ఎంతమేర పెంచాలన్నది కూడా నివేదికలో పొందుపర్చాల్సి ఉంటుంది. దీని ఆధారంగా పార్లమెంటులో ఆర్టికల్ 81(1)ను సవరణ చేస్తూ లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, ఆ తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రాలవారిగా లోక్‌సభ సీట్లను నిర్ణయించడం జరుగుతుంది.
(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ)
Also Read..
అడవిలో శాంతిస్థూపాలు దేనికి సంకేతం..! మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లో హాట్ టాపిక్
గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..